వైసీపీ నేతలు… టీడీపీ హయాంలో… ఏ ప్రాజెక్టులు, పనులైతే తీవ్రంగా విమర్శించారో.. ఇప్పుడు వాటిని తమ ఘనతగా చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. దాని కోసం ప్రజలు నమ్ముతారా లేదా.. అనేదానితో సంబధం లేకుండా… కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఏ ప్రాజెక్ట్‌లపై వైసీపీ విమర్శలు, ఆరోపణలు గుప్పించిందో.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లను తమ ఘనతగా చెప్పుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఎన్నికల సమయంలో దేనిపైనా వైసీపీ నేతలు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలుగా చెప్పారో.. ఇప్పుడు వాటినే తమ క్రెడిట్‌గా చెప్పుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి.
కియా క్రెడిట్ వైఎస్ ఖాతాలోకి..!
కియా మోటార్స్ ఏపీకి రావడానికి తమ కృషే కారణమని టీడీపీ మొదటి నుంచీ చెబుతోంది. కానీ వైసీపీ మాత్రం కియా మోటార్స్ చంద్రబాబు ఘనత కాదంటూ ఎన్నికల్లో ప్రచారం చేసింది. కియా మోదీ దయ వల్లే వచ్చిందని కూడా జగన్ అన్నారు. కానీ వైఎస్ దయ వల్లే కియా వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా మంత్రి బుగ్గన చెప్పారు. వైఎస్‌కి ఇచ్చిన మాట ప్రకారమే ఏపీలో ప్రాజెక్ట్‌ను పెట్టారంటూ.. ఆ కంపెనీ సీఈవో ముఖ్యమంత్రికి లేఖ రాశారంటూ బుగ్గన చెప్పుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. అయినా వైసీపీ స్ట్రాటజీ ప్రకారం.. వారి పని వారు చేస్తున్నారు.
పోలవరం అంచనాల ఆమోదం ఘనత జగన్ ఖాతాలోకి..!
కియా మాత్రమే కాదు…. పోలవరంపైనా ఇదే తరహాలో ప్రైడ్ ఫైట్ సాగుతోంది. పోలవరం అంచనాల పెంపు పేరుతో టీడీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందంటూ వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. కమీషన్ల కోసమే పోలవరం పెంపు అంచనాలంటూ రాజకీయంగా మాటల దాడికి దిగింది వైసీపీ. కానీ కేంద్రం మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. పోలవరం అంచనాలను పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఇది కూడా.. తమ కష్టమేనని.. విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు. జగన్.. గెలిచిన వెంటనే ప్రధానని కలిసి… పోలవరం ప్రాజెక్ట్ అంచనాలపై విజ్ఞప్తి చేశారని.. దీనికి మోడీ అంగీకరించారని.. ఇందులో చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇవే అంచనాలు… అవినీతి అని చెప్పిన వైసీపీ.. ఇప్పుడు..అంగీకారం తెలిపిన తర్వాత తమ ఘనతగా చెప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాట పడటం లేదు.
పట్టిసీమ నీళ్లు ఇస్తున్న ఘనత.. వైసీపీ అకౌంట్లోకి..!
పట్టిసీమ ప్రాజెక్ట్ విషయంలో.. వైసీపీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. పట్టిసీమ అనేది దండగ ప్రాజెక్ట్ అని.. పట్టిసీమ ద్వారా నీళ్లు ఎత్తిపోసి.. సముద్రంలోకి పంపుతున్నారని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే పనిగా ఆరోపణలు చేశారు. ఇప్పుడు… ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ద్వారా… డెల్టాకు నీరివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు.. తీవ్ర కరువులోనూ తాము నీరిస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంటే.. పట్టిసీమ ఘనత కూడా వారిదేనని చెప్పుకుంటున్నారు. అందుకే.. పట్టిసీమ చంద్రబాబు కట్టలేదని చెప్పడానికన్నట్లుగా.. విజయసాయిరెడ్డి తరచూ ట్వీట్లు చేస్తూంటారు. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టూ కట్టలేదని… నమ్మించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.