నిన్నటి నుంచి మొదలయిన ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో వైకాపా సభ్యులు సభలో ఎటువంటి గొడవ చేయకుండా కూర్చోన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగియగానే తమ పార్టీ తెదేపా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి దానిపై చర్చకు పట్టుబడుతుందని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేస్తూ, అవినీతికి పాల్పడుతూ, ఆ డబ్బుని వెదజల్లి ఫిరాయింపులకి ప్రోత్సహిస్తూ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వాసం కోల్పోయారని, కనుక ఆయనకి అధికారంలో ఉండేందుకు ఇంక ఎంత మాత్రం అర్హుడు కాడని, అందుకే తమ పార్టీ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడుతోందని జగన్ చెప్పారు. ఈ సమావేశాలు ముగిసేలోగానే దీనిపై తప్పనిసరిగా చర్చకు పట్టుబడతామని జగన్ చెప్పారు.
జగన్ మొదట స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాసం ప్రకటించారు. తెదేపా మంత్రులు, నేతల రాజధాని భూబాగోతాలను తన సాక్షి మీడియా ద్వారా బయటపెట్టడానికి ఆయన ఎంచుకొన్న టైమింగ్ ని గమనించినట్లయితే అది పార్టీలో నుండి వలసలను అడ్డుకొనేందుకేనని అర్ధమవుతుంది. ఊహించినట్లే దానితో వలసలకు చిన్న బ్రేక్ వేయగలిగారు. తెదేపా నేతల ఆరోపణలు నిజమనుకొంటే ముద్రగడ పద్మనాభాన్ని కూడా ప్రభుత్వం పైకి జగనే ఉసిగొల్పారనుకోవలసి ఉంటుంది. తన పార్టీని చంద్రబాబు నాయుడు ఇంత ఘోరంగా దెబ్బ తీస్తున్నారనే ఉక్రోషంతోనే ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్దమయినట్లు అర్ధమవుతూనే ఉంది. అంటే తన పార్టీ కాపాడుకొనేందుకే జగన్ తెదేపా ప్రభుత్వంపై ఒకేసారి ముప్పేట దాడి చేయడానికి సిద్దమయినట్లు స్పష్టం అవుతోంది. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ప్రజల కోసమే చేస్తున్న పోరాటంగా జగన్ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
తెలంగాణాలో కూడా తెరాస ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, నేతలను తరలించుకుపోతోంది. కానీ ప్రతిపక్ష పార్టీలు అందుకు తెరాస ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచన చేయడంలేదు. తెరాసను రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలలో అవి విఫలం అయినా అది గౌరవమే అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలు తెదేపాలో చేరకుండా అడ్డుకోలేక, తెదేపా వ్యూహాలను ఎదుర్కోలేక, ప్రజల కోసమే ప్రయోగించ వలసిన బ్రహ్మాస్త్రం వంటి అవిశ్వాస తీర్మానాన్ని తన స్వప్రయోజనాల కోసం ప్రయోగించబోతున్నారు.
దానిని ప్రయోగించినా తెదేపా ప్రభుత్వాన్ని ఆయన కూల్చగలరా అంటే అది తన వల్లకాని పనేనని ఆయనకి కూడా తెలుసు. ఆ ప్రయత్నంలో విఫలమయినప్పుడు తను ఒక్కడే కాక తన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా తెదేపా చేతిలో పరాభవం పొందుతారని కూడా జగన్ కి తెలుసు. అయినా జగన్ తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకే సిద్దం అవుతున్నారు. రాజకీయాలలో ఉన్నవారికి పట్టువిడుపులు, నిగ్రహం, లౌక్యం, కాస్తయినా ముందుచూపు చాలా అవసరం కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ లక్షణాలు ఏవీ లేవని అర్ధమవుతోంది. వైకాపాకు ఆయనే తిరుగులేని సేనాధిపతి ఆయనే అసలయిన శత్రువు కూడా. ఆయన శల్యసారద్యంలో ముందుకు సాగుతున్న వైకాపా వచ్చే ఎన్నికల కురుక్షేత్రం వరకు అయినా పోరాడగలుగుతుందా లేక ముందే చెల్లాచెదురయిపోతుందో చూడాలి.