ఇసుక కొరత, కూలీల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా చంద్రబాబు పన్నెండు గంటల దీక్ష చేస్తున్న సమయంలో… వైసీపీ నాయకత్వం వ్యూహాత్మకంగా.. రాజకీయ అంశాలతో ఎదురు దాడి చేసింది. మొదటగా తెలుగు యువత అధ్యక్షుడ్ని పార్టీలో చేర్చుకున్న జగన్.. వెంటనే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించింది. చంద్రబాబుపై విమర్శలు చేయించింది. కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న వల్లభనేని వంశీ.. హఠాత్తుగా.. ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రబాబు ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోతున్నారని.. ఆయన గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా వెళ్తున్నారని.. ఆయన వెంట తాము నడవాలా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తున్నారని.. ఆయనకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు. జగన్ కు మద్దతుగా ఉండటానికి తన అసెంబ్లీ సభ్యత్వమే అడ్డు అయితే.. రాజీనామా చేస్తానని ప్రకటించారు.
జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై.. వల్లభనేని వంశీ అమితమైన అభిమానం చూపించారు. ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదని.. అప్పుడే దీక్షలు, ధర్నాలా అంటూ.. విమర్శించారు. తనకు జగన్మోహన్ రెడ్డి చాలా కాలం నుంచి తెలుసని.. వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. పొత్తు లేకుండా చంద్రబాబు ఇప్పటి వరకు గెలవలేదన్నారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం పనిచేశారు మళ్లీ ఎందుకు కనపడలేదు.. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ను ఎవరు ఆపారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ తర్వాత ఒంటరిగా పోటీ చేసి గెలిచేంత బలం టీడీపీకి ఎందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. మంచిని మంచిగా ..చెడును చెడుగా చూసే రాజకీయ సంస్కారం కావాలని వంశీ నీతి వాక్యం చెప్పారు. మంచిని కూడా చెడుగా చూస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారు జనం అని హెచ్చరించారు. టీడీపీ ఇప్పటికైనా తప్పు దిద్దుకుని ప్రభుత్వానికి మద్దుతు పలకాలని పిలుపునిచ్చారు. లేకపోతే తెలంగాణలోలా పార్టీ గల్లంతవుతుందని హెచ్చరించారు. కేసులకు.. ఆర్థిక వ్యవహారాలకు కోసం.. తాను జగన్ కు మద్దతు పలకడం లేదని.. వల్లభనేని వంశీ చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చి మాత్రమే జగన్ వెంట నడుస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. జగన్ కు మద్దతివ్వడం వల్ల ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం ఉండదని వంశీ చెప్పుకొచ్చారు. జయంతికి.. వర్ధంతికి తేడా తెలియని వాళ్లు.. విమర్శిస్తే పడాలా అని ప్రశ్నించారు. వంశీని అధికారికంగా పార్టీలో చేర్చుకోకుండా.. కొన్నాళ్లు తటస్థ ఎమ్మెల్యేగా ఉంచి.. సమయం చూసి.. రాజీనామా చేయించాలని వైసీపీ నాయకత్వం అనుకుంది. అయితే.. ఇప్పుడు ఆయన బహిరంగంగా వైసీపీ కి మద్దతు పలకడంతో… అనర్హతా పిటిషన్ వేసే అవకాశం టీడీపీకి లభించినట్లయింది.
మరో వైపు దేవినేని అవినాష్ తన అనుచరులు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లభించనందునే.. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా.. దేవినేని అవినాష్ ప్రకటించారు. మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. వెంటనే .. జగన్ నివాసానికి వెళ్లి … వైసీపీ కండువా కప్పించుకున్నారు. కృష్ణా జిల్లాలో మా నాయకులు, కార్యకర్తలను.. వినియోగించుకోవడంలో టీడీపీ విఫలమైందని రాజీనామా లేఖలో అవినాష్ తెలిపారు. కార్యకర్తలకు సముచితస్థానం కల్పించాలని చంద్రబాబును కోరానని..కానీ ఫలితం కనిపించలేదన్నారు. వైసీపీలో ఆయనకు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్చార్ పదవితో పాటు… తన అనుచరులకు కార్పొరేషన్ ఎన్నికల్లో … ప్రాధాన్యం ఇస్తామన్న హామీని ఆయన వైసీపీ నాయకత్వం నుంచి పొందినట్లుగా తెలుస్తోంది. నవరత్నాల అమలు చూసి.. పార్టీలో చేరాలనుకున్నానని అవినాష్.. మీడియాకు చెప్పుకొచ్చారు.