కేంద్రానికి సహకరించే కొద్దీ సహకరించాలని వైసీపీకి అనిపిస్తున్నట్లుగా ఉంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఉన్న 28 మంది ఎంపీలతో.. కేంద్రం ఎప్పుడు ఏ బిల్లు పెట్టినా అనుకూలంగా మాట్లాడించడమే కాదు… అవసరమైనప్పుడల్లా ఓటు వేయిస్తోంది. తాజాగా..వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లుకు కూడా.. ఏకపక్షంగా వైసీపీ ఆమోదం తెలిపింది. అందులో రైతులకు నష్టం కలిగే అంశాలపై సవరణలు చేయాలని కూడా డిమాండ్ చేయలేదు. ఈ బిల్లుకు నిరసనగ ఎన్డీఏ మిత్రపక్షం అయిన అకాలీదళ్ కు చెందిన కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేసేశారు. ఎన్డీఏ నుంచి వైదొలిగేందుకు కూడా ఆలోచిస్తున్నామని ప్రకటించారు.
అకాలీదళ్ బీజేపీకి సుదీర్ఘ స్నేహితుడు. అందరూ బీజేపీని అంటరాని పార్టీగా చూస్తున్న సమయంలో అకాలీదళ్‌తో పాటు శివసేన బీజేపీతో పొత్తుల్లో ఉండేవి . శివసేన గతంలోనే బయటకు వెళ్లగా.. తాజాగా అకాలీదళ్ బయటకు వచ్చేసింది. దాంతో.. ఎన్డీఏలో బలం ఉన్న పార్టీల సంఖ్య మరింత తగ్గిపోయింది. వ్యవసాయ బిల్లుపై ఉత్తరాదిలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఆ బిల్లు వల్ల ప్రభుత్వం తన బాధ్యతను తగ్గించుకుంటోందని.. ప్రైవేటు వ్యాపారస్తులకు అనుకూలంగా… నిర్ణయం తీసుకుందని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగా పెద్ద ఎత్తున రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.. పెద్ద ఎత్తున పంటలు పండించే పంజాబ్‌లో ఈ బిల్లుపై నిరసనలు ఎక్కువగా ఉన్నాయి. పంజాబ్‌కే చెందిన హర్‌సిమ్రత్‌కౌర్ ఈ వ్యవసాయ బిల్లుపై అసంతృప్తిగానే ఉన్నారు. అందుకే రాజీనామా చేశారు. అయితే.. ఏపీ నుంచి వైసీపీ మాత్రం.. ఈ బిల్లు నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. పైగా… పంజాబ్‌లో రాజకీయ పరిస్థితుల కారణంగానే హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారని.. వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు..తనకు అర్థమైనట్లుగా మీడియా ప్రతినిధులతో చెప్పుకొచ్చారు. మొత్తానికి కేంద్రానికి ఎలాంటి డిమాండ్లు పెట్టకుండానే… మద్దతివ్వడానికి వైసీపీ తహతహలాడిపోతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కనీస ప్రయత్నం కూడా చేయడం లేదన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఏర్పడుతోంది.