ఈరోజు ఏపి అసెంబ్లీ సమావేశాలు మొదలవగానే పెన్షన్లు, నిరుద్యోగభ్రుతిపై జగన్మోహన్ రెడ్డి, కార్మిక శాఖమంత్రి అచ్చెం నాయుడికి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఎన్నికల సమయంలో జాబు కావాలంటే బాబు రావాలని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, నిరుద్యోగులకు నెలనెలా రూ.2000 నిరుద్యోగభ్రుతి కల్పిస్తామని చంద్రబాబు నాయుడు నోటికివచ్చినట్లుగా హామీలు గుప్పించారని, కానీ రెండేళ్ళవుతున్నా ఇంతవరకు ఆ హామీలలో ఒక్కటికి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో వృద్దులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని కూడా పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేకపోయినా మొసలి కన్నీళ్లు కార్చడం మాత్రం మరిచిపోరని జగన్ ఎద్దేవా చేసారు.
దానికి మంత్రి అచ్చెం నాయుడు జవాబిస్తూ స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పెన్షన్ల పధకాన్ని ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయని, గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిని అమలుచేసినప్పటికీ అనర్హులకే అవి దక్కాయని అన్నారు. తమ ప్రభుత్వం చాలా నిజాయితీగా, పారదర్శకంగా పెన్షన్లను అందజేస్తోందని కానీ జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెం నాయుడు ఆక్షేపించారు. పెన్షన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని ఆయన వాదించారు. ప్రభుత్వం తీరుని నిరసిస్తూ వైకాపా సభ్యులు సభ నుండి వాక్ అవుట్ చేసి వెళ్ళిపోయారు.
ప్రస్తుతం ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు 2016-17 సంల రాష్ట్ర బడ్జెట్ ని సభలో ప్రవేశపెట్టడానికి సిద్దం అవుతున్నారు.