తెదేపా అధికారంలోకి వస్తే అన్ని రకాల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పారు. ఆయనిచ్చిన ఆ హామీలన్నీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పొందు పరిచారు. ఆ హామీలన్నీ నేటికీ రాష్ట్రంలో అక్కడక్కడా గోడలపైన కనబడుతూనే ఉంటాయి కానీ అయన ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఆయనతో సహా తెదేపా నేతలు అందరూ తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందని ఎంత బిగ్గరగా వాదిస్తున్నా వారు తమ హామీని నిలబెట్టుకోలేదనే మాట నూటికి నూరు శాతం నిజమని రైతులకు తెలుసు..ప్రజలకి తెలుసు…ప్రతిపక్ష పార్టీలకి, మీడియాకి చివరికి తెదేపా నేతలకి కూడా తెలుసు. ఈరోజు శాసనసభలో వైకాపా అదే అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినపుడు వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు సంతృప్తికరమయిన సమాధానం ఇవ్వలేకపోయారు. అప్పట్లో ఎన్నికల సమయంలో బేషరతుగా రుణమాఫీ చేసేస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి దాదాపు రెండేళ్ళు పూర్తి కావస్తున్నా ఇంతవరకు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రూ.84,000 కోట్ల రుణాలు మాఫీ చేయవలసి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇంబ్తవరకు కేవలం రూ.7,400 కోట్లు మాత్రమే మాఫీ చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని జగన్ విమర్శించారు. జగన్ ఇంకా ఈ అంశంపై ప్రసంగిస్తుంటే, స్పీకర్ కోడెల శివప్రసాద రావు కలుగజేసుకొని ఒకే అంశంపై గంటల తరబడి ఉపన్యాసాలు చేయవద్దని, కావాలంటే నిరసన తెలియజేయవచ్చని సూచించగా, తెదేపా ప్రభుత్వం రైతులను మోసం చేసినందుకు నిరసనగా వాక్ అవుట్ చేస్తున్నట్లు ప్రకటించి జగన్ తన పార్టీ సభ్యులతో కలిసి సభ నుండి బయటకు వెళ్ళిపోయారు.
ఏదయినా సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు సభ నుండి వాక్ అవుట్ చేయడం ప్రజాస్వామ్యబద్దమే. కానీ ఈ అంశంపై తెదేపా ప్రభుత్వం చేత తన తప్పుని ఒప్పించి, రైతులకు న్యాయం జరిగేలా చేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారనే చెప్పక తప్పదు. ఆయన నిరసనగా వాక్ అవుట్ చేయడం వలన తెదేపా ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది, నష్టమూ ఉండదు. అలాగే రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతులకి దాని వలన ఎటువంటి ప్రయోజనం చేకూరదు. దీనిపై నిరసన తెలిపేందుకు వాక్ అవుట్ చేయవచ్చని స్పీకర్ సూచించడం దానిని జగన్ అమలు చేయడం గమనిస్తే తెదేపా ప్రభుత్వం తను కోరుకొన్నట్లుగానే శాసనసభను నడిపించుకొంటోంది తప్ప ప్రభుత్వంపై జగన్ ఏమాత్రం ఒత్తిడి తేలేకపోతున్నారని స్పష్టమవుతోంది. దానిని ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వైఫల్యంగానే చూడవలసి వస్తుంది.