వాలంటీర్లకు ప్రజాధనం గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. సాక్షిపేపర్ కొనడానికి కూడా డబ్బులిస్తున్నారు. వారు వైసీపీ కోసం పని చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. కానీ అనధికారికంగానే. అయితే ఇప్పుడు వైసీపీ బరి తెగించేసింది. అధికారికంగా ఆ వాలంటీర్లను పార్టీ పనులకు వాడుకుంటున్నారు. గడప గడపకూ వైసీపీ అనే పార్టీ ప్రచార కార్యక్రమాన్ని రాత్రికి రాత్రి గడప గడపకూ మన ప్రభుత్వం అని మార్చి… రూ. ఐదారు వందల కోట్లు కూడా బడ్జెట్లో కేటాయించుకున్న దోచుకుతినే మనస్థత్వానికి.. ఇక వాలంటీర్లను పార్టీకి వాడుకోవడం అనేది చాలా చిన్న విషయం.
స్టిక్కర్లు అంటించడానికి … జగనే మీ భవిష్యత్ అని హెచ్చరించడానికి… గృహసారధులు పేరుతో కొంత మంది వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లబోతున్నారు. వీరికి వాలంటీర్లు సహకరించాలట. అదికారికంగా చెప్పేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనం అవుతోంది. పార్టీ పనులకు ప్రజాధనాన్ని వాడుకోవడం.. అత్యంత దారుణమైన అధికార దుర్వినియోగం అన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇలాంటి అధికార దుర్వినియోగాలు ఎన్ని జరిగాయో లెక్కే లేదు. ఇప్పుడు కొత్తగా చేసినా ఆ రొటీనేగా అనుకునే పరిస్థితి. చట్టాలు, రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు ఈ ప్రభుత్వం ఉల్లంఘించిందో చెప్పడం కష్టం. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం వినకపోతే బుల్ డోజ్ చేయడం వెన్నతో పెట్టిన విద్య.
వాలంటీర్లు పక్కన లేకపోతే.. ప్రజలు తిరగబడతారేమో అని.. వైసీపీ నేతలు భయపడుతున్నట్లుగా ఉంది. వాలంటీర్లుపక్కన ఉంటే.. పెన్షన్లు ఆపేస్తారని.. పథకాలు నిలిపివేస్తారని భయపడతారని అనుకుంటున్నారు. ఇక ఇంటింటికి స్టిక్కర్లు తీసుకెళ్లే వారికి పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా ఉంటుందా?