వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవాస్తవాల ప్రచారాన్నే నమ్ముకుంటోంది. ఏపీలో డీఎస్పీ పోస్టులన్నీ ఒకే వర్గానికి ఇచ్చారన్న దగ్గర్నుంచి జనసేన 65 సీట్లలోనే పోటీ చేసిందనే అంశం వరకూ.. అన్నీ అబద్దాలనే ప్రచారం చేస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి హేరిటెజ్ చిల్లర దుకాణాలు చంద్రబాబువేనని ఇప్పటికీ చెబుతూంటారు. హోదా వస్తే ఇన్‌కంట్యాక్స్, జీఎస్టీ ఉండదని చెబుతూనే ఉంటారు. ఇన్ని అబద్దాలు చెప్పడం వెనుక.. మాస్టర్ ప్లాన్ ఉందన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
విశాఖపట్నం లోక్‌సభ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వీవీ లక్ష్మినారాయణ .. తమ పార్టీ 88 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై.. వెంటనే.. విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. అసలు జనసేన పార్టీ అరవై ఐదు స్థానాల్లోనే పోటీ చేసిందని.. తీర్మానించేసి.. 88 సీట్లలో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. వైసీపీ కొద్ది రోజులుగా.. ఇదే తరహా ప్రచారం చేస్తూండటం.. మీడియాలోనూ కథనాలు రాస్తూండటంతో.. రాజకీయవర్గాల్లో కొత్త చర్చ ప్రారంభమయింది. జనసేన పార్టీ 135కి పైగా స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో రెండు, మూడు చోట్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన స్థానాలను ఉభయకమ్యూనిస్టు పార్టీలకు, బీఎస్పీకి కేటాయించింది. జనసేన గుర్తు గాజు గ్లాస్ 130కిపైగా నియోజకవర్గాల్లో ఉంది. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డికి… తప్పుడు లెక్కలు ఇంకెంత కాలం రాస్తారని.. ప్రశ్నించి.. ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు.
అయినా వైసీపీ సోషల్ మీడియా.. అసలైన మీడియా కూడా.. జనసేనపై తప్పుడు ప్రచారాన్ని ఆపలేదు. చివరికి ఇటీవలి కాలంలో జగన్‌కు సపోర్ట్‌గా మారిన నమస్తే తెలంగాణలో కూడా ఇలాంటి కథనమే ప్రచురించారు. అయినా ఎందుకిలా ప్రచారం చేస్తున్నారన్నది.. రాజకీయవర్గాల్లో మిస్టరీగా మారింది. జనసేన ఇలా చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేసిందన్న ప్రచారాన్ని జనంలోకి పంపడం ద్వారా.. ఆ పార్టీకి బలం లేదని… ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నాన్ని చేస్తున్నారన్న అనుమానాలను జనసేన నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇది మాత్రమే కాదని.. దీని వెనుక ఏదో మాస్టర్ ప్లాన్ ఉందన్న అనుమానంతో… చాలా జాగ్రత్తగా వైసీపీ నేతల ప్రకటనల్ని గమనిస్తున్నారు. డీఎస్పీలంతా… చంద్రబాబు సామాజికవర్గం వారేనని చేసిన ఆరోపణలపై… ఇప్పటికీ.. క్లారిటీ ఇవ్వలేదు. అసలు డీఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్లలో రెడ్లే ఎక్కువగా ఉన్నారని అధికారికంగా పత్రాలు రిలీజ్ చేసినా అదే ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి అబద్దాలు చెప్పి… అదే నిజం అని నమ్మించడానికి వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక అసలు లక్ష్యం ఏమిటో మాత్రం తెలియాల్సి ఉంది.