తాము ఒక వాదనకు కట్టుబడి దానికి అనుకూలంగా మాట్లాడాలని ‘ఫిక్స్’ అయిపోయారంటే.. ఇక తాను పట్టిన కుందేలికి మూడేకాళ్లు అనేంత మూర్ఖంగా వాదించడంలో రాజకీయనాయకులకు మరెవ్వరూ సాటిరారు. ప్రతి సందర్భంలోనూ వారికి తెలిసిన వాస్తవాలు వేరే ఉంటాయి.. బయటకు రాజకీయం కోసం మాట్లాడే మాటలు మరో తీరుగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో.. ఇలాంటి బుకాయింపు మాటలు మాట్లాడుతున్న సమయంలోనే.. వారి తీరు, ఆ ద్వంద్వ వైఖరిని పట్టించేస్తూ ఉంటుంది. ఇప్పుడు సీపీఎంకు చెందిన సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నారు. రోహిత్ విషయంలో ఆయన తన మాటల గారడీ ని ప్రదర్శిస్తున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఇంకా పార్లమెంటులోనూ ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై సుదీర్ఘమైన ప్రసంగం చేసి.. దాని మీదే బోలెడు చర్చోపచర్చలకు ఆస్కారం కల్పించిన మంత్రి స్మృతి ఇరానీ ఆ ప్రసంగంలో ఏచూరి గురించి రోహిత్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించిన సంగతి అందరికీ తెలుసు. ఏచూరి గురించి వేముల రోహిత్ తన ఫేస్బుక్ ఎకౌంట్లో నెగటివ్ వ్యాఖ్యలు గతంలో చేశారు. అయితే రోహిత్ మరణం తర్వాత.. సహజంగానే అన్ని పార్టీలు దీనిని రాజకీయం చేయడానికి ప్రయత్నించినట్లే.. యేచూరి కూడా విపరీతంగా రాద్ధాంతం చేశారు.
ఇరానీ ఈ వ్యాఖ్యల్ని ప్రస్తావించడంతో ఆయనకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. దాంతో డొంకతిరుగుడు మాటల బాటను ఎంచుకున్నారు. రోహిత్ ఎఫ్బీ ఖాతాలో యేచూరిపై దూషణలు ఉండగా, ఆ ఎఫ్బీ ఖాతా రోహిత్ దే అనడానికి ఆధారాలేంటంటూ… యేచూరి ప్రశ్నించడం విశేషం. దీనిపై బుకాయించడానికి రకరకాల మార్గాలు ఎంచుకోవచ్చు. అయితే.. ఏకంగా రోహిత్ తన వ్యక్తిగత ఎఫ్బీ ఖాతాలో పెట్టిన వ్యాఖ్యలకు సంబంధించి.. ఆ ఖాతా అతనిదేనా.? ఆ వ్యాఖ్యలు అతనే టైప్ చేశాడనడానికి ఆధారాలు ఏంటి? అని ప్రశ్నించడం చాలా డొంకతిరుగుడుగానే ఉన్నదని పలువురు అంటున్నారు. ఇంత దాకా వచ్చాక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే తమ వాదనకు, అనుకూలంగా ఉండడం కోసం కొత్తగా ఆధారాలు అడగడం.. పలాయనవాదంగానే ఉన్నదని అనుకుంటున్నారు.