బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప తన ఖరీదైన లైఫ్ స్టయల్ ను బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా అక్రమాలకు పాల్పడారని అవినీతి కేసులున్నాయి. వాటిమీద విచారణ జరుగుతోంది. ఈ కారణంగానే బీజేపీ నుంచి బయటకు వెళ్లి, మళ్లీ లోనికి వచ్చిన యడ్యూరప్పను బీజేపీ మంచి పదవితోనే గౌరవించింది. ఇప్పుడు కోటి రూపాయల ఖరీదైన కారులో కరువు పీడిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు.
టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రడో కారును ఇటీవల ఓ వ్యాపారి బహుమతిగా ఇచ్చారట. కోటి రూపాయల కారును నజరానాగా ఇచ్చారంటే మతలబు లేకుండా ఉంటుందా? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో బలమైన లీడర్ కాబట్టి, ఎందుకైనా మంచిదని గిఫ్ట్ ఇచ్చారో లేక నిజంగానే ఆయనంటే అభిమానంతో ఇచ్చారో వేరే విషయం. కానీ కరువుతో విలవిల్లాడుతున్న రైతులను పరామర్శించడానికి ఇంత ఖరీదైన కారులో పోవాలా అనేది ప్రశ్న. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు యడ్యూరప్పపై యుద్ధ భేరీ మోగించారు. అవినీతిపరుడైన ఆయన కనీసం ఆలోచన లేకుండా రైతులను కించపరిచేలా లగ్జరీ కారులో పరామర్శకు వెళ్లడం దారుణమని విమర్శిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా కరువు తాండవిస్తోంది. కర్ణాటకలోనూ తీవ్రంగా ఉంది. సమయం సందర్భాన్ని బట్టి మనిషి ప్రవర్తన ఉండాలి. పెళ్లికి వెళ్లేటప్పుడు ఖరీదైన డ్రెస్ వేసుకుంటారు. ఏదైనా విషాదకరమైన సందర్భం అయితే తెల్లడి డ్రెస్ లేదా ఆడంబరంగా కనిపించని సాదా సీదా డ్రెస్ వేసుకుని వెళ్తారు. వర్సాలు లేక, పంటలు లేక, నష్టాల పాలై అష్టకష్టాలు పడుతున్న రైతుల ముందు తన డాబును దర్పాన్ని ప్రదర్శిచడం వల్ల ఒరిగేది ఏమిటి? వచ్చిన నాయకుడు తమకు మేలు చేస్తాడనే నమ్మకం కలగాలంటే ఆ విధంగా ప్రవర్తించారు. ఈయన డాబూ దర్పం చూసిన రైతులు, ఇది కేవలం ఫొటోల కోసం పోజులివ్వడమే అని అనుకునే అవకాశాలే ఎక్కువ. విమర్శలు మరీ ఎక్కువ కావడంతో యడ్యూరప్ప పునరాలోచనలో పడ్డట్టున్నారు.
మొదట, గ్రామాలకు వెళ్లేటప్పుడు కాస్త కమ్ ఫర్ట్ అవసరమని వాదించారు. ఇప్పుడు లగ్జరీ కారును పక్కనబెట్టాలని, వీలైతే రైల్లో వెళ్లాలని భావిస్తున్నారట. ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖరీదైన వాచీ దుమారం రేపింది. ఎవరో ఇచ్చిన బహుమతి అని చెప్పినా యడ్యూరప్ప సహా బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా సరైన ఆలోచన లేని విధంగా వ్యవహరించడానికి ప్రయత్నించడం బట్టి చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. రాజకీయ నాయకులకు ప్రజల కష్టాల పట్ల కనీస సానుభూతి ఉండదు. వాళ్ల సానుభూతి మాటలు మనసులోంచి రావనే విమర్శలు నిజమేనని రుజువు చేయడానికి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయేమో.