కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. ఎడ్యూరప్ప కొద్ది సేపటి క్రితం బెంగళూరులో భాజపా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన అవినీతి కారణంగానే కర్ణాటకలో భాజపా అధికారం కోల్పోయింది. తరువాత జరిగిన ఎన్నికలలో ఆయనే భాజపాకి సైంధవుడిలాగ అడ్డుపడ్డారు. అయినా కూడా భాజపా ఆయననే నమ్మడం, అవినీతిపరుడని తెలిసి ఉన్నా ఆయనకే పార్టీ బాధ్యతలు అప్పగించడం విచిత్రం. ఆవిధంగా చేయడం వలన ప్రత్యర్ధుల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని తెలిసినా కూడా భాజపా ఆయనకే పార్టీ పగ్గాలు అప్పజెప్పింది. అందుకు కారణం కేవలం ఆయనకి మాత్రమే 2018లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాజపాని మళ్ళీ అధికారంలోకి తెచ్చే శక్తి ఉందని దృడంగా నమ్మడమే. ఆయన అవినీతిపరుడనే మాట ఎంత వాస్తవమో, భాజపాని అధికారంలోకి తేగల సామర్ధ్యం ఉందనేది కూడా అంతే వాస్తవం. అందుకే భాజపా తెగించింది. ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టక మునుపే, భాజపా అధిష్టానాన్ని సంప్రదించకుండానే వచ్చే ఎన్నికలలో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధిని తానేనని ప్రకటించేసుకొన్నారు కూడా. అందుకు భాజపా ‘హర్ట్’ అవలేదు ఆయన ధీమా చూసి ‘ఇంప్రెస్’ అయింది. అందుకే ఆ పదవి కట్టబెట్టింది. ఇంకా కర్నాటకలో భాజపాని పాల ముంచినా నీట ముంచినా ఆయనదే బాధ్యత.
ఒకప్పుడు కర్నాటక ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించి ఒక వెలుగు వెలిగిన ఎడ్యూరప్ప, ఆ తరువాత అవినీతి ఆరోపణల కారణంగా పార్టీకి వీడవలసిరావడం, ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం, జైలుకి వెళ్ళడం, స్వంత కుంపటి పెట్టుకొన్నా గత ఎన్నికలలో ఓటమిపాలవడం వంటి అనేక చేదు అనుభవాలు రుచి చూసారు. కనుక ఆయనఆకలితో ఉన్న పులిలాగ (అధికారం కోసం) విజ్రుంభించవచ్చు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని చీల్చి చెండాడవచ్చును.
వచ్చే ఎన్నికలలో భాజపాని గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడమే ఎడ్యూరప్ప లక్ష్యం అయినప్పటికీ, ఈలోగా సిద్దరామయ్య ప్రభుత్వానికి ఎసరుపెట్టే అవకాశాలు వస్తే వదిలిపెట్టరు. భాజపా ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చివేసింది. అగ్నికి వాయువు తోడయినట్లు భాజపాకి అవినీతిపరుడయిన ఎడ్యూరప్ప తోడయ్యారు కనుక వచ్చే ఎన్నికల వరకు తన ప్రభుత్వానికి డోకా లేదని సిద్దరామయ్య కూడా ధీమాగా కూర్చోవడానికి లేదు. కనుక ఇక నుండి ఎడ్యూరప్పను జాగ్రత్తగా గమనిస్తూ చురుకుగా పావులు కదపడం నేర్చుకోవాలి లేకుంటే ఎడ్యూరప్పకి తన ముఖ్యమంత్రి కుర్చీ సమర్పించుకోక తప్పదు.