కర్ణాటక రాజకీయ పరిణామాలు.. ఎవరూ ఊహించని విధంగా మారిపోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై.. అటు బీజేపీ అగ్రనాయకత్వం… వేచి చూసే ధోరణిలో ఉందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో… స్పీకర్.. సంచలనాత్మక నిర్ణయంతో… ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేశారు. అదీ కూడా.. వారు మళ్లీ 2023 వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా వేటు వేయడంతో.. రాజకీయాలు కీలక మలుపులు తిరగడం ఖాయమని అందరూ భావించారు. రెబెల్ ఎమ్మెల్యేలు అందరూ మనసు మార్చుకుంటారని అనుకున్నారేమో కానీ… బీజేపీ నేత యడ్యూరప్ప… ఉదయమే వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు.
రాజ్‌భవన్ దగ్గర.. యడ్యూరప్ప.. తాను ఆరు గంటలకు.. ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించుకున్నారు. అయితే రాజ్ భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. కానీ.. బీజేపీకి ఇప్పుడు మెజార్టీ లేదు. మైనార్టీ ప్రభుత్వమే అవుతుంది. పూర్తి మెజార్టీ మద్దతు లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఎలా ఆహ్వానిస్తారన్న ప్రశ్నలు మాత్రం జోరుగానే వినిపిస్తున్నాయి. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య… ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటకను.. భారతీయ జనతా పార్టీ.. ఓ రాజకీయ ప్రయోగశాలగా మార్చిందని మండిపడ్డారు.
అయితే.. కర్ణాటక రాజకీయాలు.. ఎవరూ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీకి ఇప్పుడు 105 మంది సభ్యుల మద్దతు ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో 220మంది బలంగా ఉంది. అంటే.. కనీసం 111 మంది సభ్యుల మద్దతు కావాలి. రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ తరపున మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అలాంటి ప్రకటన చేసిన మరుక్షణం.. అనర్హతా వేటు వేయడానికి స్పీకర్ రెడీగా ఉన్నారు. వారు సభకు గైర్హాజర్ కావాలి. కానీ.. అసలు మైనార్టీ సర్కార్ ఏర్పాటుకు… అదీ కూడా.. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి.. బలం నిరూపించుకోవడంలో విఫలమైన పార్టీకి.. ఎలా చాన్సిస్తారనేది.. ఆసక్తికరంగా మారింది. కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.