ఆంధ్రప్రదేశ్లో యూనివర్శిటీల పాలక మండళ్ల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దశలో.. యంత్రాంగం మొత్తం… దానిపైనే దృష్టి పెట్టినా… హఠాత్తుగా వర్శిటీల పాలకమండళ్లను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం అసలు సమస్యను కాక.. ఇతర అంశాల్లోనే చురుగ్గా ఉందేమోనని అనుకునేలా ఆ ఉత్తర్వులు ఉన్నాయి. సిఫార్సుల మేరకు.. ఒకే సామాజికవర్గానికి అత్యధికం కట్టబెట్టినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కొన్ని యూనివర్శిటీల పరిధిలోని పాలక మండళ్లలో మెజార్టీ ఒకే సామాజికవర్గం వారు ఉన్నారు. నియమితులైన వారందరూ… సిఫార్సుల మీద వచ్చిన వారే. ఎవరెవరు సిఫార్సు చేశారో కూడా.. . ఫైల్స్లో రాయడం.. సంచలనం సృష్టిస్తోంది.
మీడియాలో ఏపీ సర్కార్ తీరుపై ఒక్క సారిగా విమర్శలు రావడంతో… దానికి కౌంటర్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి.. మీడియా పైనా.. టీడీపీపైనా ఎదురుదాడి చేశారు కానీ.. నియామకాల్లో వచ్చిన ఆరోపణలపై వివరాలు ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఒకే సామాజికవర్గానికి పెద్ద పీట వేశారనే ఆరోపణలు మీడియా నుంచి.. విపక్ష నేతల నుంచి వచ్చాయి. అయితే.. తాము యాభై శాతం మేర.. రిజర్వేషన్లు పాటించామని.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళలకు కేటాయించామని చెప్పుకొచ్చారు. పచ్చ మీడియా అంటూ… ఈ ఆరోపణలు చేసిన వారిపై మండిపడ్డారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అంత కంటే దారుణంగా నియామకాలు జరిగినా ప్రశ్నించలేదని తప్పు పట్టారు.
ప్రభుత్వ వ్యవహారాల్లో జరుగుతున్న ప్రతి పనిలోనూ… విమర్శలు వచ్చినప్పుడు.. ఆయా వర్గాల ఎదురుదాడి.. అయితే పచ్చ మీడియా అని లేకపోతే.. వాళ్లని ఫలానా సామాజికవర్గమనే ఎదురుదాడి చేస్తున్నారు తప్ప… తమపై వచ్చిన ఆరోపణలకు.. సమాధానం ఇవ్వడానికి సిద్ధపడలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ అలా చేసిందని వాదిస్తున్నారు. నిజంగా గత ప్రభుత్వం అలాగే చేసిందని ఎదురుదాడి చేస్తే.. ఆ ప్రభుత్వానికి ప్రజలు ఏ గతి పట్టించారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. మరి వాళ్లు చేసినట్లుగానే మేము చేస్తామనే వాదనను ఎందుకు వైసీపీ సర్కార్ చేస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు.