చంద్రబాబులో అభద్రతా భావం, భయం మామూలుగా పెరిగిపోవడం లేదు. తాను ఎదిగొచ్చిన విధానం దృష్ట్యా అంతకుముందు కూడా ఆ లక్షణాలు ఉండేవి కానీ 2014 తర్వాత నుంచీ మాత్రం మరీ ఎక్కువైపోతున్నాయి. ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో ఎన్నికల ప్రచారం సమయంలో నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చేశాడు చంద్రబాబు. చంద్రబాబు కాదు కదా….మాయలు, మంత్రాలు తెలిసినవాళ్ళో, వేరే ఏదో శక్తి ఉన్నవాళ్ళో తప్ప మానవమాత్రులు ఎవరూ కూడా ఆ హామీలు నెరవేర్చలేరు. పదేళ్ళ తర్వాత అధికారంలోకి రావడానికి సాయం చేసిన అందరికీ దోచుకోవడానికి అనుమతులు ఇవ్వాల్సిన పరిస్థితి. మరోవైపు ధనిక రాష్ర్టమైన తెలంగాణాతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేస్తున్నాను అని ప్రజలను నమ్మించాల్సిన పరిస్థితి. కెసీఆర్ కంటే నేనే మొనగాడిని అని నిరూపించుకోవాల్సిన అగత్యం. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఓటుకు నోటులో అడ్డంగా దొరికిపోవడంతో మరీ కష్టమైపోయింది. మోడీ ఏమీ చేయకపోయినా మోడీని సమర్థిస్తూ ఉండాల్సిన అగత్యం. అలాగే మోడీ తప్పులను తనపైన వేసుకోవాల్సిన దురదృష్టకర పరిస్థితి.
ఓ వైపు కేంద్రం నుంచి అణాపైసా సాయం లేదు. మరోవైపు ఎటు చూసినా కరువే కనిపిస్తోంది. ఆదాయం లేదు. కానీ మెహర్భానీ విషయంలో తగ్గితే పరువుపోతుందన్న భయం. అద్భుతమైన అభివృద్ధిని ప్రజల కంటికి చూపించాల్సిన పరిస్థితి. అందుకోసమని చెప్పి అత్యంత సులువైన మార్గాన్ని ఎంచుకున్నాడు చంద్రబాబు. చేతల్లో ఏమీ లేకపోయినప్పటికీ మాటల్లో, గ్రాఫిక్స్‌లో మాత్రం అద్భుతాలు చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఆ అద్భుతాలను నమ్మించడం కోసం ఆయన భజన మీడియా కూడా యథాశక్తి ప్రయత్నాలు చేస్తూ ఉంది. హైదరాబాద్ అంటే ఛార్మినార్‌ని చూపించినట్టుగా అమరావతికి సంబంధించిన ప్రతి వార్తను కూడా అద్భుతమైన గ్రాఫిక్స్ ఫొటోలతో ప్రజెంట్ చేస్తోంది. తప్పులన్నింటినీ కవర్ చేస్తోంది. 1994 పరిస్థితులే ఉండి ఉంటే చంద్రబాబుకు ఎలాంటి సమస్యా వచ్చి ఉండేది కాదు కానీ సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు ప్రతి ఓటరుకూ వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ కూడా క్షణాల్లో లక్షల మందికి రీచ్ అవుతోంది. మరోవైపు సాక్షి పత్రిక కూడా ఉంది. అందుకే అధికార పార్టీ ఆటలు సాగడం లేదు. కొత్తగా ఎన్నికైన కర్నూలు జిల్లా టిడిపి ఎమ్మెల్సీ శిల్పా వారి కారు ఒక పౌరుడిని యాక్సిడెంట్ చేసింది. ఆ పౌరుడి ప్రాణాలు పోయాయి. ఆ పౌరుడి బంధువులు, కుటుంబసభ్యులు న్యాయం చేయమని చెప్పి ధర్నా కూడా చేశారు. ఈ మొత్తం వార్తని ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఎలా పబ్లిష్ చేశాయో ఒకసారి చూడండి. దాచడానికి ఎంతగా ప్రయత్నం చేశాయో పరిశీలించండి. మామూలుగా అయితే ఈ వార్త అందరికీ తెలియకూడదు. కానీ సోషల్ మీడియా పుణ్యమాని అందరికీ రీచ్ అయిపోయింది. జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం, భూమా నాగిరెడ్డి ఇష్యూ, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఓట్లేసిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింట టిడిపి ఘోరంగా ఓడిపోవడం లాంటి విషయాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం కూడా ఇప్పుడు ప్రజలకు చేరుతూ ఉంది. అదే అధికార పార్టీకి చాలా పెద్ద తలనొప్పి అవుతోంది. అందుకే సొంతంగా ఆలోచించడం చేతకాని…ఆ మాటకొస్తే ఆలోచిచండమే రాని, సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటున్నారు. సోషల్ మీడియాని నిషేధించాలి అనే స్థాయిలో మాట్లాడేస్తున్నారు. వాళ్ళ పిచ్చిగానీ మళ్ళీ 90ల నాటికి తీసుకెళ్ళడం, ప్రజలకు సమాచారం చేరకుండా చేయడం లాంటి అద్భుతాలు సాధ్యమయ్యే పనేనా? అలాంటి ప్రయత్నాలు మానుకుని తప్పులు తగ్గించుకుని….ప్రజలకు ఉపయోగపడే పనులు నిజాయితీగా చేయడం పైన దృష్టిపెడితే వాళ్ళకే మంచిది. అలా కాకుండా సోషల్ మీడియాని, జనాల వాయిస్‌ని నియంత్రించాలని ప్రయత్నిస్తే మాత్రం ఆ తర్వాత పరిణామాలను చంద్రబాబు కూడా ఊహించలేడు.