షర్మిల పాదయాత్రలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి తన పార్టీ తరపున ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయనను తన సోదరుడిగా చెప్పారు.కానీ ఇప్పుడు ఆ ఏపూరి సోమన్న షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. షర్మిల పార్టీ తరపున పోటీ చేసినా .. చేయకపోయినా ఒకటే అనుకుని బీఆర్ఎస్లో చేరిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవల ప్రజా గాయకుడు సాయిచంద్ చనిపోయారు. దీంతో బీఆర్ఎస్కు మంచి ప్రజా కళాకారుని లోటు ఏర్పడింది. ఆటపాటలతో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఏపూరి సోమన్న ఆ లోటు భర్తీ చేస్తారని అనిపించడంతో ఆయనను కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినందుకు తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం సోమన్నకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగావకాశాన్ని కల్పించారు. కానీ ఏపూరి సోమన్న అంతకు మించి ఆశించారు. దక్కే చాన్స్ కనిపించకపోవడంతో ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేశారు. కాంగ్రెస్ లో చేరారు. ప్రభుత్వంపై తన పాటల ద్వారా పోరాటాన్ని సాగించారు. అ గత ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారు. తన సాంస్కృతిక బృందంతో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. కానీ కాంగ్రెస్ లో గుర్తింపు లభించడం లేదని.. తుంగతుర్తి సీటు వస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో షర్మిల పార్టీలో చేరారు. షర్మిల పాదయాత్రలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో నిర్వహించి దళిత భేరి బహిరంగ సభలో ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. 2023లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా సోమన్న పోటీ చేస్తారని అన్నారు.
అయితే ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తన్నారు. పార్టీ పరమైన కార్యక్రమాలు నిలిపివేశారు. దీంతో ఏపూరి సోమన్న అసంతృప్తికి గురయ్యారు. తన రాజకీయ భవిష్యత్ మళ్లీ గండంలో పడుతుందని భావించి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపూరి సోమన్న రాజీనామాతో షర్మిల పార్టీలో షర్మిల తప్ప మరో నేత లేకుండా పోయినట్లయింది.