పాడిందే పాడరా.. అన్న సామెత చందంగా ఉన్నది తెతెదేపా నాయకుడు ఎర్రబెల్లి దయాకర్రావు గ్రేటర్ ఎన్నికల బరిలో సాగిస్తున్న ప్రచారం. గ్రేటర్ ఎన్నికల్లో అధికార తెరాసను ఎంత ఘాటుగా ఎదుర్కొంటారు.. ఎలా మట్టి కరిపిస్తారు.. అనేవే కీలకాంశాలు కాగా, సాంప్రదాయబద్ధంగా కొన్ని నెలలనుంచి, ఆ మాటకొస్తే ఏడాదికి పైగా ఏ ఎజెండా మీద తెరాసను విమర్శిస్తూ వస్తున్నారో.. అవే విమర్శలను ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఎర్రబెల్లి సంధిస్తున్నారు. ఎలాంటి విమర్శలు వినడానికి జనం మొహం మొత్తిపోయి ఉన్నారో.. అవే మాటలు చెబుతున్నారు. కనీసం విమర్శల్లో కూడా కొత్తదనం లేకపోతే ఎలా అని జనం విస్తుపోయే పరిస్థితి ఉన్నదని పలువురు అంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఎర్రబెల్లి.. తెరాస అభ్యర్థులు ఈ ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకోవడం సంగతి తర్వాత.. ముందు తమ పార్టీనుంచి తెరాసలో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలను దమ్ముంటే రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకుంటే చాలు.. అని సవాలు విసురుతున్నారు. నగర పరిధిలో ఆరుగురు తెదేపా ఎమ్మెల్యేలు ప్రస్తుతం గులాబీ కోటలోనే సేదతీరుతున్నారు. వారిమీద అనర్హత వేటు వేయించడం గురించి ఎర్రబెల్లిఎంత సుదీర్ఘమైన పోరాటం సాగించి విఫలం అవుతూన్నారో అందరికీ తెలుసు. ఆ విషయం మీద తెరాస పట్టించుకోని ఉపేక్ష ధోరణితో తీసిపారేస్తుండగా.. ఎర్రబెల్లి మాటలు వినీ వినీ జనానికి చిరాకు వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో కూడా ఎర్రబెల్లి అదే రికార్డు వేస్తున్నారు. దానికి తోడు దళితుడిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పాడు.. వంటి పాచిపోయిన విమర్శల్ని ఆయన ఇప్పుడు మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి వాటివల్ల ఓట్లు రాలవని, కాస్త ఫైర్ ఉన్న కొత్త విమర్శలతో దూసుకుపోవాలని పార్టీ అభ్యర్థులు ఆయననుంచి ఆశిస్తే తప్పేముంది.