హైదరాబాద్: నవ్యాంధ్ర నిర్మాణం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పార్టీలకతీతంగా అండదండలు అందివ్వాల్సిఉందని, అందుకే తాను టీడీపీలోకి చేరానని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు చెప్పారు. ఆయన ఇవాళ విజయవాడలో చంద్రబాబు నాయుడు సమక్షంలో పచ్చకండువా కప్పుకున్నారు. ఆ తర్వాత బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. తాను గతంలో కూడా 24 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఎమ్మెల్యే నుంచి జడ్పీ ఛైర్మన్ వరకు అనేక పదవులు నిర్వహించానని చెప్పారు. వ్యక్తిగత కారణాలవల్ల వైసీపీలో చేరానని తెలిపారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రస్తుతం నవ్యాంధ్ర నిర్మాణానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్న ఈ కీలక సమయంలో ఒక పౌరుడిగా, ఒక ఎమ్మెల్యేగా ఆయనకు మద్దతివ్వటంకోసమే టీడీపీలో చేరానని అన్నారు. ఆయన ఎంతో ప్రేమగా, అభిమానంగా అక్కున చేర్చుకున్నారని చెప్పారు.
2018 నాటికి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయటానికి కృషిచేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు డేవిడ్ రాజు తెలిపారు. తన నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్య పరిష్కారంకోసం తక్షణమే రు.4 కోట్లు విడుదల చేస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లు వెల్లడించారు. దళితులకు కూడా టీడీపీ ప్రభుత్వం విశేషంగా సాయపడుతోందని అన్నారు. తనకు వెలిగొండ ప్రాజెక్ట్ కంటే ఏదీ ముఖ్యం కాదని డేవిడ్ రాజు చెప్పారు.