తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పటి నుంచి బీఆర్ఎస్ కు ఎప్పుడూ అభ్యర్థుల సమస్య రాలేదు. తీవ్ర పోటీ ఉండేది. కానీ ఇప్పుడు టిక్కెట్లు ఇస్తామంటే వద్దంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి ముందుకొచ్చే నేతలే లేరు. సిట్టింగ్ ఎంపీలు అందరూ దాదాపుగా సైడ్ అయిపోయారు.
భారత రాష్ట్ర సమితికి ప్రస్తుతం 9 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ ఇప్పటికే హస్తం గూటికి చేరుకున్నారు. మరి కొంత మంది నేతలు కూడా కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలతో టచ్ లోకి వెళ్లారు. మరికొంత మంది పోటీ చేయబోమని చెబుతున్నారు చేవెళ్ల, జహీరాబాద్, ఖమ్మం మహబూబాబాద్ ఎంపీలు జాతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారిపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసుకుంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రతిపాదనలో ఉన్న టి రాజయ్య కూడా పార్టీ మారిపోయారు. చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించారని మాజీ మంత్రి మల్లారెడ్డి నేరుగా ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల బరిలో ఉంటారనుకుంటున్న నేతలు మెల్లమెల్లగా పార్టీ నుంచి దూరమవుతున్నారు. సీటు ఇస్తామన్నా పోటీకి వెనుకాడుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీల ఏజెండాతోనే ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయంతో పార్లమెంట్ ఎన్నికల బరిలో జాతీయ పార్టీల నుంచి పోటీ చేసేందుకు గులాబీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. నిజామాబాద్ నుంచి కూడా కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. కరీంనగర్ లో పరిస్థితి బాగోలేకపోవడంతో వినోద్ కూమార్ కూడా వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు. ఒకప్పుడు కంచుకోట లాంటి ఆదిలాబాద్ లో ఇప్పుడు ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి గట్టి అభ్యర్థి లేరు. కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారని గతలో అనుకున్నారు కానీ ఇప్పుడు మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు వినిపిస్తోంది. కవిత, కేటీఆర్, కేసీఆర్ ఎవరూ లోక్ సభ బరిలోకి దిగడం లేదు.
బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టలేకపోతే బీఆర్ఎస్ పరిస్తితి ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని చోట్లా బీజేపీ, కాంగ్రెస్ తరపున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అక్కడ పోటీకి ఎక్కువ మంది ఉన్నారు.