కరీంనగర్ ను లండన్ చేస్తా.. ఏపీని సింగపూర్ చేస్తా.. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తా అని రాజకీయ నేతలు చాలా సార్లు చెబుతూ ఉంటారు. చెప్పారు కూడా. దానర్థం … పేర్లు మార్చడం కాదు. అక్కడి స్థాయిలో అభివృద్ధి.. అదే స్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు మార్చేస్తామని అర్థం. ఆ దిశగా వారు ఎంత ప్రయత్నించారు..? ఎంత సక్సెస్ అయ్యారు.. ? అన్నది తర్వాత విషయం కానీ.. వారి ఆలోచనలు మాత్రం అవే . కానీ భారతీయ జనతా పార్టీ నేతల ఆలోచనలు.. ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్ల ఆలోచనలు మాత్రం కాస్త తేడా ఉంటాయి. పేరు మారిస్తేనే బతుకులు బాగుపడిపోతాయన్నట్లుగా ఆయన తీరు ఉంటోంది. హైదరాబాద్ కు వచ్చి ఆయన చేసిన ప్రచారం ఇంతే ఉంది. గ్రేటర్లో బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్ పేరు మార్చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
హైదరాబాద్ పేరును.. భాగ్యనగరంగా మార్చేస్తామని యోగి ఆదిత్యనాథ్ చెబుతున్నారు. అసలు పేరు మార్పు అనే దానికి… బల్దియా మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏమైనా సంబంధం ఉందా లేదా అన్నది తర్వాత సంగతి కానీ.. ఆయన ప్రకటించేశారు. హైదరాబాద్‌లో లేని ప్రజల భాగ్యం… భాగ్యనగరంగా పేరు మార్చేసిన తర్వాత వచ్చేస్తుందా అన్న చర్చ ఇప్పుడు సామాన్య ప్రజల్లో ప్రారంభమయింది. అసలు పేరు ఎందుకు మార్చాలనే చర్చ కూడా వచ్చంది. హైదరాబాద్ అనే పేరులో హైదర్ అనే ముస్లిం పేరు ఉంది కాబట్టి..మార్చేస్తామని యోగి ఆదిత్యనాథ్ ఉద్దేశం. హైదరాబాద్ లో ఇలా ప్రతీ దాన్ని మతం కోణంలో చూసి.. బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు
యోగి ఆదిథ్యనాథ్ మఠాధిపతి. రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారు. కానీ ఆయన హిందూత్వ ధర్మం అంటే.. పరమత అసహనాన్ని చూపించడమే అనుకుంటున్నారు. ఫలితంగా ముస్లింల పేర్లు ఉన్న పట్టణాల పేర్లను మార్చేస్తామని తిరుగుతున్నారు. యూపీలో అధికారం ఉంది కాబట్టి.. కాశీ లాంటి పేర్లను ప్రయాగరాజ్‌గా మార్చేశారు. ఇంకా చాలా పేర్లను మార్చేశారు. ఇప్పుడు యూపీలో ఏ సిటీ ఏ పేరుతో ఉందో.. గత సిటీ పేరు ఏమిటో తెలియని గందరగోళ పరిస్థితి ఉంది. అదేదో గొప్ప ఘనకార్యంలా హైదరాబాద్ పేరు మార్చేస్తానని ఆయన ప్రకటించారు. నిజానికి ఒక్క హైదరాబాద్ పేరు మాత్రమే కాదు.. గతంలో నిజామాబాద్, కరీంనగర్‌లలోనూ అదే ప్రకటించారు. అక్కడ ఎంపీలు గెలిచినా ఇంత వరకూ పేరు మార్చలేదు. బహుశా.. గ్రేటర్లో గెలిచిన తర్వాత.. ఆ అధికారంతో అక్కడ కూడా పేర్లు మారుస్తారేమోనన్న సెటైర్లు పడుతున్నాయి.