భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి వెళ్లిన తరువాత రాష్ట్ర నేతలు మాంచి దూకుడుతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపాకే ప్రజలు పట్టం కడతారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో భాజపాని తట్టుకోవడం తెరాస వల్ల కాదంటూ సినీ ఫక్కీలో డైలాగులు చెబుతున్నారు రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి తీరతామని ఆయన అన్నారు. అమిత్ షా వస్తేనే కేసీఆర్ బెదిరిపోయారనీ, తడబడిపోతున్నారనీ, వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎంతోమంది ప్రముఖులతో తెలంగాణలో ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రంగంలోకి దిగుతారని లక్ష్మణ్ ప్రకటించడం విశేషం. అమిత్ షా వస్తేనే అల్లల్లాడిపోతున్న కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీతోపాటు యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారానికి దిగితే ఎలా ఉంటుందో వారే ఊహించుకోవాలని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. అయితే, అమిత్ షాగానీ ఆదిత్యనాథ్ గానీ హిందీలోనే మాట్లాడతారనీ, అయినాసరే తెలంగాణలో వారి ప్రభావం అనూహ్యంగా ఉంటుందని ఇప్పట్నుంచే జోస్యం చెబుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి వస్తారని, ప్రభావం చూపుతారని అనడంలో అర్థముంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు కాబట్టి, అమిత్ షా కూడా క్యాంపెయిన్ చేస్తారనడమూ కొంతవరకూ ఫర్వాలేదు. కానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న యోగీ ఆధిత్యనాథ్ తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తే.. లక్ష్మణ్ చెబుతున్న రేంజి ప్రభావం ఎలా ఉంటుందీ..? ఆయన యూపీకి ముఖ్యమంత్రి అయిన తరువాత కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. ఆయన విధానాల పట్ల దేశవ్యాప్తంగా కొంత ఆసక్తి ఉంది. అయితే, ఆయన యూపీ దాటి, ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి, భాజపాకి ఓటెయ్యమని ప్రచారం చేయగానే ప్రజలు వినేస్తారని అనుకుంటే ఎలా..? ఆయన పాలనా తీరు నచ్చడం వేరు.. ఆయన చెప్పారని భాజపాకి ఓటెయ్యాలని నిర్ణయించుకోవడం వేరు కదా!
వచ్చే ఎన్నికల్లో ఎవరు ప్రచారానికి వస్తారనేది కూడా లక్ష్మణ్ ఇప్పట్నుంచే చెప్పేస్తున్నారు కదా! ఈ ప్రకటనను ఎలా అర్థం చేసుకోవాలి..? అంటే, ప్రధాని మోడీ, అమిత్ షా, ఆదిత్యనాథ్ వంటి నేతలందరూ దిగొస్తేనే తెరాస ఎదుర్కొనే బలం సమకూరుతుందని చెబుతున్నట్టా..? తెరాసను ఎదుర్కోవడానికి ఇన్ని శక్తుల్ని తెలంగాణలో మోహరించాలా..? అంటే, పరోక్షంగా తెరాస బలాన్ని లక్ష్మణ్ చెబుతున్నట్టుగా ధ్వనిస్తోంది కదా! ఈ కోణం నుంచి ఆలోచిస్తే.. లక్ష్మణ్ చేసిన ప్రకటన తెలంగాణలో భాజపా బలహీనతకు అద్దం పడుతోందని అంటున్నవారూ లేకపోలేదు. ఏదేమైనా, తెలంగాణలో భాజపా-తెరాసల మధ్య పొలిటికల్ హీట్ బాగానే జనరేట్ అయింది. అయితే, దీన్ని కేసీఆర్ ఎటువైపు డ్రైవ్ చేస్తారో అనేది వేచి చూడాలి!