ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ హత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాంగ్రెస్ హయాంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా ఘటన కావడంతో.. రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తోందన్న విమర్శల దగ్గర్నుంచి అర్థరాత్రి పూట హత్యాచారానికి గురైన యువతి అంత్యక్రియలు నిర్వహించడం వరకు అనేక ఆరోపణలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అయితే వీటన్నింటికీ యోగి సర్కార్ ఎదురుదాడిని.. రాజకీయ ఆరోపణల్ని పరిష్కారంగా చూసుకుంటోంది.
రేప్ ఘటన ఆధారంగా ప్రభుత్వంపై కుట్ర చేశారంటూ.. గుర్తు తెలియని వ్యక్తులపై ఏకంగా దేశద్రోహం కేసులు పెట్టేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కొందరు బాధిత కుటుంబానికి డబ్బులు ఇవ్వాలని చూసినట్లు ఆరోపించారు. యూపీ ప్రభుత్వం తమకు ఎలాంటి సాయం చేయలేదని చెప్పినందుకు 50 లక్షలు ఇస్తామని చెప్పారని పోలీసులు చెబుతున్నారు. అయితే వాళ్లు ఎవరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పుకున్నారు. ఎవరో తెలియకుండా.. డబ్బులు ఇస్తామన్న విషయాన్ని ఎలా కనిపెట్టారనేది అంతుచిక్కని విషయం. మీడియా పైనా యూపీ సర్కార్ గురి పెట్టింది. బాధితురాలి కుటుంబసభ్యులతో జర్నలిస్టులు మాట్లాడారంటూ.. వారిని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కోంటోంది. యూపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని బాధితులు చెబుతున్నారు.
అసలు కేసు గురించి యూపీ పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ.. ఆ ఘటన ఆధారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. మొత్తం అంశానికి కులం, మతం రంగు పులిమి దానిని స్వప్రయోజనాలకు ఉపయోగించే ప్రయత్నం జరుగుతోందని యూపీ సర్కార్ కోర్టుకు చెప్పింది. రేప్ ఘటనల నేపధ్యంలో యూపీలో శాంతిభద్రతలపై కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో కుట్ర పేరుతో యోగి సర్కార్ బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.