ఆదిలాబాద్లో అక్రమ నిర్మాణం కూల్చేస్తే.. హైడ్రానే.. వరంగల్.. మెదక్.. ఇలా ఎక్కడ కూల్చివేతలు జరిగినా చివరికి ప్రైవేటు వ్యక్తులు ఏదైనా కూల్చకున్నా… ఇదిగో హైడ్రా నిర్వాకం అంటూ సోషల్ మీడియలో వైరల్ చేస్తున్నారు. మూసి ని క్లియర్ చేసేందుకు మార్కింగ్ వేస్తోంది హైడ్రా కాదు. కానీ హైడ్రా పేరుతో అక్కడ జరుగుతున్న రచ్చ రాజకీయం అంతా ఇంతా కాదు. ఇటీవల సంగారెడ్డిజిల్లాలో ఓ చెరువులో కట్టిన ఇంటిని డిటోనేటర్లతో పేల్చేశారు. అది హైడ్రా కాదు. కానీ హైడ్రానే కూల్చేసిందని ప్రచారం చేస్తుతున్నారు.
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా… కూల్చివేత అంటే.. హైడ్రా పేరు వాడేస్తున్నారు. హైడ్రా అనేదానికి ఓ పరిధి ఉంది. అది హైదరాబాద్ దాటి పోవడానికి అవకాశం లేదు. అయినా కనీస అవగాహన లేకుండా ప్రచారాలు చేస్తున్నారు. ఈ భయానక ప్రచారం చివరికి ఏమీ తెలియని అమాయకుల్ని ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలో లేనప్పటికీ.. ఉన్నట్లుగా కొన్ని యూట్యూబ్ చానళ్లు ప్రచారంచేసి.. కూల్చేస్తారని హడావుడి చేయడంతో కూకట్ పల్లిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీనికీ హైడ్రానే కారణం అనడం ప్రారంభించారు.
ఇక సంచలనం కోసం.. హైడ్రా పేరును వాడుకునే యూట్యూబ్ చానళ్లు చేస్తున్న ప్రచారాలకు హద్దూ అదుపూ లేకుండా పోయింది. శనివారం వస్తే పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉంటాయని ఊహించుకుని ఇష్టం వచ్చినట్లుగా ప్రచారాలు చేస్తున్నారు. హైడ్రా ఫోబియాను పెంచుతున్నారు. ఇది మంచికో చెడుకో కానీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తోంది.