ఒకప్పుడు యువ దర్శకులు అగ్ర కథానాయకులతో సినిమాలు చేయాలంటే చాలా కాలం ఎదురు చూడాల్సివచ్చేది. స్టార్లతో ములాఖాత్ అంత త్వరగా కుదిరేది కాదు. ఓ దర్శకుడు స్టార్ హీరోల కంట్లో పడాలంటే అద్భుతాలు చేయాల్సిందే. వరుస హిట్లు కొడితే తప్ప, ఆ ఛాన్సు లేదు. అయితే ఇప్పుడు అలా కాదు. కాలం మారింది. జనరేషన్ మారింది. ఆలోచనలూ మారాయి. ఒక్క హిట్టు చాలు.. ఒకే హిట్టు చాలు. బడా హీరోలు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. అందుకే కుర్ర దర్శకులు వచ్చీ రావడంతోనే – పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు.
సుజిత్ వయసెంత? తీసిన సినిమాలెన్ని? కానీ.. ప్రభాస్ తో సినిమా చేసేశాడు. ఇప్పుడు చిరంజీవితో ‘లూసీఫర్’ రీమేక్ కి రెడీ అయ్యాడు. ప్రభాస్ తో తీసిన `సాహో` హిట్టయ్యిందా? లేదే..? అంటే తొలి సినిమాతో కొట్టిన హిట్టు ప్రభావం ఇంకా పరిశ్రమలో ఉందన్నమాట. అందుకే.. సుజిత్‌ని నమ్మాడు చిరు. ‘నిన్నుకోరి’, ‘మజిలి’లతో హిట్టు అందుకున్న శివ నిర్వాణ.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకూ చిన్న చిన్న అడుగులేసుకుని వస్తున్న నాగ అశ్విన్.. ప్రభాస్‌కి కథ చెప్పి ఒప్పించగలిగాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకి ముందు.. స్వరూప్ ఎవరికీ తెలీదు. ఇప్పుడు పెద్ద హీరోలు తనతో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. తనేమో.. ”అమీన్ ఖాన్, ప్రభాస్‌కి సరిపడే కథ నా దగ్గర ఉంది” అంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ దర్శకుడికి ప్రభాస్ నుంచి పిలుపు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పరశురామ్ ఒక్కసారిగా బిగ్ లీగ్ లోకి చేరిపోయాడు. మహేష్ బాబుతో సినిమా చేసేస్తున్నాడు. ‘ఆర్. ఎక్స్ 100’ దర్శకుడి పరిస్థితీ అంతే. రెండో సినిమా ఆలస్యం అవుతోందని గానీ, పెద్ద హీరోల దృష్టిలో ఎప్పుడో పడిపోయాడు. మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి అజయ్ భూపతి ప్లాన్ చేస్తున్నాడన్నది టాలీవుడ్ టాక్.
వెంకీ కుడుముల, వెంకీ అట్లూరిలు కూడా ఒక్కసారిగా బిగ్ లీగ్ హీరోల కోసం కథలు రాసుకునే పనిలో పడిపోయారు. టాలీవుడ్ లో ఎప్పుడు ఏ కాంబో సెట్టయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. హీరోలు, దర్శకుల మైండ్ సెట్ ఆ రకంగా మారిపోయింది. పెద్ద దర్శకుడు కొత్తవాళ్లతో సినిమాలు చేయడానికైనా కాస్త ఆలోచిస్తున్నాడు గానీ, హీరోలు మాత్రం అంతంత సమయం తీసుకోవడం లేదు. ఒక్క మెతుకు చాలు. అన్నం ఉడికిందో, లేదో చూడ్డానికి. ఒక్క సినిమాలు చాలు, దర్శకుడి టాలెంట్ కనిపెట్టడానికి. పైగా.. టాలీవుడ్లో దర్శకుల కొరత చాలా ఉంది. హీరోలు చాలామంది తయారవుతున్నారు. వాళ్లకు సరిపడా కథలు, దర్శకులు లేరు. అందుకే.. కొత్తవాళ్లకు అంత త్వరగా ఛాన్సులు వస్తున్నాయి. అయితే ఆ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం.. యంగ్ డైరెక్టర్లకు తిప్పలు తప్పవు. అలాంటప్పుడు అటు పెద్ద సినిమాలకూ, ఇటు చిన్న చిత్రాలకూ కాకుండా పోతారు. ఈ విషయంలో మాత్రం యువ దర్శకులు కాస్త జాగ్రత్తగా అడుగులేయాలి.