హీరో అంటే.. తెరపైనా కాదు, బయట కూడా ఎగ్రసీవ్గా ఉండాల్సిందేనా? యువ హీరోల్ని చూస్తుంటే అలానే అనిపిస్తోంది. వేదికలపై విజయ్ దేవరకొండ చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన స్పీచ్ ఎప్పుడు విన్నా అందులో ఏదో ఓ కాంట్రవర్సి కనిపిస్తుంటుంది. తన డ్రస్సింగ్, హెయిర్ స్టైల్, చేసే హంగామా – అంతా ఓ స్టైల్లో ఉంటుంది. దాంతో ట్రోల్స్, మీమ్స్.. బోల్డంత పని దొరుకుతుంది. సినిమా విడుదలకు ముందు కాస్త ఎగ్రసివ్ గా మాట్లాడడం… ఆ సినిమా గురించి జనాలు మాట్లాడుకునేలా చేయడం విజయ్ దేవరకొండ నేర్పించాడు.
ఆ తరవాత.. దాన్ని విశ్వక్ సేన్ ఫాలో అయ్యాడు. గత రెండు మూడు సినిమాల నుంచి విశ్వక్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. పాగల్ కి ముందు.. `ఈ సినిమా హిట్టవ్వకపోతే నా పేరు మార్చుకుంటా` అనేసి భారీ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న కిరణ్ అబ్బవరపు కూడా ఇదే స్థాయిలో ఊగిపోయాడు. తన సినిమా రిలీజ్ రోజున కడప నుంచి ఫ్యాన్స్ ని తీసుకొచ్చి – థియేటర్ల ముందు గోల చేయించాడు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే… శ్రీవిష్ణు కూడా `ఈ కథ పాన్ ఇండియా స్థాయిది… ఈ సినిమాని అన్ని భాషల్లో రీమేక్ చేస్తారు.. రాసి పెట్టుకోండి` అనేశాడు.
నిజంగా హీరోలు ఇలా మాట్లాడాల్సిందేనా? దాని వల్ల ఉపయోగం ఎంత? అనేది పక్కన పెడితే ఆయా సినిమాల పబ్లిసిటీకి ఇవన్నీ చాలా ఉపయోగపడుతున్నాయి. పాగల్ జయాపజయాల్ని పక్కన పెడితే – ఆ సినిమా ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పుడు `రాజ రాజ చోర` కూడా అంతే. రేపు `లైగర్` విడుదలైతే.. విజయ్ ఇంతకు మించి హడావుడి చేయడం ఖాయం. కొత్త హీరోల ట్రెండ్ ఇది. తమ సినిమాన్ని నిలబెట్టుకోవడానికి, బతికించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకోవాలి.
పెద్ద హీరోలకు ఎప్పుడూ ఈ అవసరం రాలేదు. ఎందుకంటే అప్పటికే వాళ్ల సినిమాలకు రావల్సిన బజ్ వచ్చేసి ఉంటుంది. అందుకే పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోలు తమ సినిమా గురించి వేదికలపై ఎక్కువగా మాట్లాడరు. నాని, శర్వా లాంటి యంగ్ హీరోలూ అంతే. కాకపోతే ఈ జనరేషన్ కాస్త స్పీడు గా ఉంది. పబ్లిసిటీ ప్రధాన మంత్రం అని నమ్ముతున్నారు. తమ సినిమా గురించి తామే మాట్లాడకపోతే.. ఇక మిగిలినవాళ్లెందుకు మాట్లాడతారు? అన్నది వాళ్ల ఉద్దేశ్యం కావొచ్చు. పైగా థియేటర్ వ్యవస్థ డోలాయమాన పరిస్థితుల్లో ఉంది. ప్రేక్షకులకు సినిమాలకు రావడానికే ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు హీరోలు ఇంత దూకుడు చూపించకపోతే.. ప్రేక్షకుల్లో ఊపు రాదు. అయితే ఇదే సరైన దారి అని చెప్పలేం. ఎప్పుడైనా సరే.. సినిమా మాట్లాడాలి. జనం మాట్లాడాలి. తీసినవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఆ జనం వరకూ చేరాలంటే – హీరోలు మాట్లాడక తప్పడం లేదు. మున్ముందు పెద్ద హీరోలూ ఇదే పంథా అవలంభిస్తారేమో చూడాలి.