కథల ఎంపిక దగ్గరే సినిమా విజయం సగం నిర్ణయమైపోతుదంటారు. ఆ తర్వాత దర్శకుడు కథను తెరపై తీసుకొచ్చే విధానం, నిర్మాణ సంస్థల ప్రామాణికత సినిమా సక్సెస్‌కు నిర్ణయాత్మక కారణాలవుతాయి. గత విజయాలు ఎన్నివున్నా సరే ఒక్క అపజయం పలకరిస్తే చాలు హీరోలు కుదేలవుతారు. తిరిగి కెరీర్‌ను గాడిలోకి పెట్టుకోవడానికి శ్రమిస్తుంటారు. గత కొంతకాలంగా టాలీవుడ్ యువ హీరోలు పరాజయాలతో సతమతమవుతున్నారు. కథల ఎంపికలో వారి జడ్జిమెంట్ అంచనాల్నితప్పుతోంది.
ఎవడే సుబ్రహ్మణ్యం మొదలుకొని ఆ! వరకు వరుసగా తొమ్మిది విజయాలతో జైత్రయాత్ర సాగించారు నాని. గడచిన మూడేళ్లలో టాలీవుడ్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కృష్ణార్జునయుద్ధం చిత్రంతో నాని విజయపరంపరకు బ్రేక్‌పడింది. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. సక్సెస్ హ్యంగోవర్‌లో నాని చిత్ర కథాంశం ఎంపికలో నిర్లక్ష్యం చేశారనే విమర్శలు వినిపించాయి. ఇక మరో యువహీరో నితిన్‌తో జయాపజయాలు దోబుచూలాడుతుంటాయి. ఇష్క్ సినిమాకు ముందు వరుసగా 11 పరాజయాలతో నితిన్ కెరీర్లో బ్యాడ్ఫేజ్ను ఎదుర్కొన్నాడు. ఒకానొకదశలో ఆయన కెరీర్ ప్రశ్నార్థకమైంది. ఇష్క్, గుండెజారి గల్లంతయిందే చిత్రాలతో తిరిగి పుంజుకున్నారు. ఆ తర్వాత మరో రెండేళ్లు నితిన్‌కు పరాజయాలే పలకరించాయి. అఆ విజయంతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. అయితే నితిన్ గత రెండు చిత్రాలు లై, ఛల్ మోహనరంగ ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ చిత్రాలు నితిన్‌కు నిరాశను మిగిల్చాయి. ప్రస్తుతం ఆయన దిల్‌రాజు సంస్థలో శ్రీనివాస కల్యాణం చేస్తున్నారు. ఈ సినిమా తిరిగి తనకు విజయాన్ని తెచ్చిపెడుతుందనే ధీమాతో వున్నారు నితిన్.
ఇక కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయంతో పరిశ్రమ దృష్టిని ఆకట్టుకున్నాడు రాజ్‌తరుణ్. ప్రామిసింగ్ యంగ్ హీరోగా గుర్తింపు పొందాడు. గత మూడేళ్లలో రాజ్‌తరుణ్ ఒక్క విజయానికి నోచుకోలేదు. అంధగాడు మొదలుకొని ఇటీవల వచ్చిన లవర్ వరకు ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రేమకథలతో పాటు ప్రయోగాత్మక ఇతివృత్తాల్ని ఎంచుకున్నప్పటికీ రాజ్‌తరుణ్ విజయాల్ని అందుకోలేకపోయాడు. ఇక సాయిధరమ్‌తేజ్ కూడా ఇదే పంథాలో సాగుతున్నాడు. సుప్రీమ్ తర్వాత సాయిధరమ్‌తేజ్‌కు సరైన విజయం కరువైపోయింది. జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ చిత్రాలతో హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్‌ను మూటగట్టుకున్నాడు. ఇక మంచు హీరోలు విష్ణు, మనోజ్‌లు రేసులో లేకుండా పోయారు. దేనికైనా రెడీ తర్వాత విష్ణు నటించిన సినిమాలు ఒక్కటి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇటీవల విడుదలైన ఆచారి అమెరికా యాత్ర అట్టర్‌ఫ్లాప్‌గా మిగిలిపోయింది. మంచు మనోజ్ కూడా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు.
యువ హీరోల చిత్రాలు వరుసగా పరాజయం చెందడం టాలీవుడ్‌ను కలవరపెడుతున్నది. కథల ఎంపికలో తడబాటే వారి వైఫల్యాలకు కారణమని అభిమానులు భావిస్తున్నారు.