తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో యువత దూరమయ్యారు. ఎన్టీఆర్ టైంలో… రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారే.. కొంత కీలకంగా ఉన్నారు. అదే.. యువతను..పార్టీకి దూరం చేసిందనే అభిప్రాయం… ఇప్పుడు … టీడీపీలో వినిపిస్తోంది. యువ నాయకత్వం లేకపోతే.. .పార్టీ భవిష్యత్ ఇబ్బందికరమేనని నిర్ణయానికి వచ్చారు చంద్రబాబు. పార్లమెంట్ వారీగా జిల్లా కమిటీలు నియమించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీటిలో యువతకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నామని చెబుతున్నారు. పార్టీ భవిష్యత్ కోసం యువనాయకత్వాన్ని ప్రోత్సహించడం ఇప్పుడు టీడీపీ అధినేతకు తప్పనిసరి.
నిజానికి టీడీపీలో యువనేతలకు కొదవలేదు. కాకపోతే.. వారిలో వారసులే ఎక్కువగా ఉన్నారు. చాలా మంది.. తమను తాము నిరూపించుకుంటున్నారు కూడా. అయితే.. ఎక్కువ మంది వారసులే. పాత తరం పోయి.. కొత్త తరానికి మళ్లీ పగ్గాలిస్తే.. వారసులకే ఇస్తారా.. అనే అనుమానం టీడీపీ శ్రేణుల్లో ప్రారంభమయింది. కింది స్థాయి నుంచి పని చేసుకుంటూ వచ్చిన వారికి అవకాశం ఇస్తే… వచ్చే గెలుపే స్థిరంగా ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టంట్గా నాయకులయ్యే వారి పరిస్థితి ఎప్పుడూ డొలాయమానంలో ఉంటుంది. ఈ విషయం .. విద్యార్థి దశ నుంచి రాజకీయంగా ఎదిగిన టీడీపీ అధినేతకు తెలియనిదేం కాదు. కానీ.. కారణాలేమైనా… టీడీపీలో.. ఆ స్థాయిలో నాయకత్వం ఎదుగలేదు. ఎదగలేదు అనే కంటే… అవకాశాలు కల్పించలేదు .
ఎప్పుడూ సీనియర్లకు అవకాశాలు కల్పిస్తూ పోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత తీరిగ్గా.. సమస్యలన్నీ.. సర్దుబాటు చేసుకుని.. యువ నాయకత్వానికి.. సీనియర్లతో ట్రైనింగ్ ఇప్పించగలిగే వెసులుబాటు దొరికింది. టీడీపీ అధినేత కూడా అదే అంచనా వేశారు. అందుకే.. యువతరానికి పార్టీ పదవుల్లో ప్రోత్సాహం ఇచ్చి.. వారిని ప్రభుత్వంపై పోరాటానికి రంగంలోకి దింపాలనుకుంటున్నారు. అయితే చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించి.. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. చివరికి.. ఆ ఆలోచన..అమల్లోకి వచ్చే సరికి.. సమయం మించిపోతుంది. మరి ఈ సారైనా ముందడుగు వేస్తారా.. అన్నది కీలకం..!