సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను, పోరాటాలను మరోసారి వివరించారు. రాబోయే ఎన్నికల్లో ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. ముందుగా, తిరుపతికి వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాక ప్రచార కార్యక్రమాలు మొదలుపెడతామన్నారు. శ్రీకాకుళం నుంచి ప్రచారం ప్రారంభిస్తా అన్నారు.
ఈ ప్రభుత్వానికి ఎన్నివైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చినా, ప్రజాహితం కోసం అన్నీ తట్టుకుని ముందుకుపోయామన్నారు. ఈ ప్రభుత్వం వల్ల కలిగిన లాభాలేంటి, విమర్శలు చేస్తున్నవారి వ్యాఖ్యల్లో వాస్తవాలేంటని అందరూ ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఇక్కడ ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకుని పాలనా వ్యవస్థను స్థాపించామన్నారు. ఒక్క పిలుపుతో రైతులు స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చారనీ, కుటుంబాలు హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడే ఉంటామంటూ ఉద్యోగులు ముందుకొచ్చారన్నారు. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఐదేళ్ల వరకూ ఇక్కడికి రాలేదని ప్రశ్నించారు? ఐదేళ్లపాటు రానివారికి ఓటు అడిగే హక్కు ఎక్కడుందన్నారు? నరేంద్ర మోడీ, కేసీఆర్ లకు జగన్ ఊడిగం చేస్తున్నారన్నారు. ఈ గడ్డపైనే ఉండటానికి ఇష్టపడని మీకు (జగన్) ఓటు ఎందుకెయ్యాలన్నారు? జగన్ కి ఓటేస్తే, అది కేసీఆర్ కి వేసినట్టే అన్నారు చంద్రబాబు.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు వెళ్తే.. ఆంధ్రావాళ్ల పాలన కావాలా అని కేసీఆర్ అడిగారనీ, ఇప్పుడు ఇక్కడ తెలంగాణా వాళ్ల పాలన కావాలా అని మండిపడ్డారు ముఖ్యమంత్రి. ఇలాంటివారికి ఊడిగం చేసే జగన్ కి ఓటెయ్యాలా అని ప్రజలను అడుగుతున్నా అన్నారు. ఆంధ్రాలో ఈయనకి (జగన్) ఒక్క సీటు వచ్చినా, కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మన ప్రయోజనాలను దెబ్బతీసే పరిస్థితి వస్తుందన్నారు. కేసీఆర్ అంటున్న ఫెడరల్ ఫ్రంట్ కి జగన్ మద్దతు ఇస్తానన్నారు కదా, అలాంటప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదని కేసీఆర్ తో కేంద్రానికి ఎందుకు లేఖ రాయించలేదన్నారు? జగన్ కి కొన్ని సీట్లొస్తే, అవి కేసీఆర్ అకౌంట్లో వేసుకుని రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి వస్తుందన్నారు. మొత్తంగా, ముఖ్యమంత్రి ప్రసంగమంతా ఎన్నికల పాయింటాఫ్ వ్యూ నుంచి సాగింది. జగన్ కి ఓటేస్తే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవనే అంశాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇవే అంశాలను ప్రధాన అజెండాగా టీడీపీ ప్రచారంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశముంది.