సినిమా పరిశ్రమ, అందులోని వ్యక్తులు.. వారి జీవితాలు పబ్లిక్ ప్రాపర్టీ అయ్యాయి. ప్రతి ఒక్కరూ టేకిట్ గ్రాంటెడ్ అన్నట్లుగా తీసుకుని వారి జీవితాలకు రంకులు అంటగట్టేస్తున్నారు. వాళ్లకు కుటుంబాలు ఉంటాయని వారూ మనుషులేనని మర్చిపోతున్నారు . ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని మూలాలను అన్వేషిస్తే.. మొదటగా కనిపించేది యూట్యూబ్ చానల్స్. వైరస్ లాగా ప్రారంభమై … క్యాన్సర్ లాగా ముదిరిపోయింది. ఇప్పుడు ఆ క్యాన్సర్ సైడ్ ఎఫెక్టులన్నీ భరించాల్సి వస్తోంది.
యూట్యూబ్ చానల్స్ థంబ్ నెయిల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేయని సినీ ప్రముఖుడు లేడు !
” ఆ హీరోతో రాత్రి గడిపిన హీరోయిన్ ” ” ఆ హీరోయిన్ అకౌంట్ చాలా పెద్దదే ” ” ఆ సినీ కుటుంబానికి వావి వరసులుండవట “.. ఇవి కొన్ని యూట్యూబ్ చానల్స్ థంబ్ నెయిల్స్. చెప్పుకోవడానికి .. రాసుకోవడానికి సిగ్గుపడి వీలైనంత తక్కువ జుగుప్సాకరంగా ఉన్న థంబ్ నెయిల్స్ గురించి మాత్రమే ఇక్కడ ఉదాహరణగా ప్రస్తావించడం జరిగింది. అసలు కొన్ని యూట్యూబ్ చానల్స్ పెట్టే థంబ్ నెయిల్స్.. చెప్పే వార్తలు వింటే దిగువ స్థాయి నీచ మనస్థత్వం ఉన్న వారికి హాయిగా ఉంటాయి కానీ.. అవి ఎవరిపై వేశారో వాళ్లకు మాత్రం కంపరం పుడుతుంది. నిజంగా తాము ఇంత దరిద్రులమా అని అనుకోవాల్సి వస్తోంది. ఇన్ని ఘోరాలు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిపై జరిగాయి. కానీ ఎప్పటికప్పుడు ఆవేదన చెందడమే కానీ.. కఠినమైన చర్యలు తీసుకోలేకపోయారు.
కొండా సురేఖ లాంటి వాళ్లు చెప్పేమాటలన్నీ యూట్యూబ్ చానల్స్ చెప్పిన చెత్తే !
యూట్యూబ్ చానల్స్ పెట్టే థంబ్ నెయిల్స్, వాళ్లు వేసే వార్తలపై ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఏదో ఓ సందర్భంగా మండిపడ్డారు. నటి ఝాన్సీ దగ్గర నుంచి కోట శ్రీనివాసరావు వరకూ అందరూ బాధితులే. అక్రమ సంబంధాలు అంటగట్టడమే కాదు.. అప్పటికి అప్పుడు వ్యూస్ కావాలంటే ఎవర్నో ఒకర్ని చంపేస్తారు ఈ యూట్యూబ్ చానల్ ఓనర్స్. వారు బయటకు వచ్చి మేము బతికే ఉన్నాం మహా ప్రభో అంటే అదే చూపించి మరికొన్ని వ్యూస్ పొందుతారు. ఈ యూట్యూబ్ చానళ్ల వికృతం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ యూట్యూబ్ చానళ్ల ప్రభావం ఎంతగా ఉందంటే.. సామాన్యుల్లో అవన్నీ నిజంగా జరిగాయనే నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఓ అబద్దాన్ని వంద సార్లు చెబితే నిజం అవుతుందన్నట్లుగా.. ఇండస్ట్రీలోని వారిపై గాసిప్స్ అదేపనిగా చెప్పి క్యారెక్టర్ ను నాశనం చేస్తున్నారు. కొండా సురేఖ చెప్పిన వాటికి ఆధారం ఏమిటి…. అవన్నీ క్యాన్సర్ లా పట్టుకున్న యూట్యూబ్ చానల్స్ లో చెప్పిన చెత్తే.
వైరస్ నుంచి క్యాన్సర్‌గా మారింది.. ఇంకా ముదిరితే కష్టమే !
అసలు ఈ యూట్యూబ్ చానల్స్ ను ఎందుకు నియంత్రించలేకపోతున్నారు.. తమ ఇండస్ట్రీని చులకన చేస్తూంటే ఎందుకు చూస్తూండిపోతున్నారో ఎవరికీ అర్థం కాదు. యూట్యూబ్ చానల్స్ పెట్టుకున్న వాళ్లలో కొంత మంది ఇండస్ట్రీలో ఏదో ఓ డిపార్టుమెంట్లో చిన్న చిన్న పనులు చేస్తూంటారు. మరికొంత మందికి అసలు ఇండస్ట్రీతో పరిచయమే ఉండదు. సంబంధమే ఉండదు. క్రిటిక్స్ పేరుతో రెచ్చిపోతూంటారు. అక్రమ సంబంధాలు అంటగట్టడం క్రిటిసిజం ఎలా అవుతుందో ఇండస్ట్రీకే విశ్లేషించుకోవాలి. యూట్యూబ్ చానల్స్ ముందు వైరస్ గా మొదలైనా ఇప్పుడు అది క్యాన్సర్ స్థాయికి చేరిపోయింది. ఇంకా ముదిరిపోతే.. టాలీవుడ్ లో ఎవరి కుటుంబాలకు.. ఎవరి వ్యక్తిత్వాలకూ గ్యారంటీ ఉండదు. అందర్నీ రోడ్డున పడేస్తారు. ఇప్పటికైనా ఈ వైరస్ ను.. క్యాన్సర్ ను వదిలించుకునే ప్రయత్నం చేయాలి.. వదిలించుకునేంతగా కాకపోతే..కనీసం నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే కాస్త టాలీవుడ్‌కు అందులోని వ్యక్తుల క్యారెక్టర్లకు కాస్త రక్షణ దొరుకుతుంది.