కొద్ది రోజుల కిందట కొంత మంది తెలుగు యూట్యూబర్లు ఆన్ లైన్ లో కలుసుకున్నారు. దాన్ని లైవ్ పెట్టుకున్నారు. ఓ తండ్రి.. మూడు, నాలుగేళ్లు నిండని చిన్న పిల్లపై అత్యంత ఘోరంగా జోక్స్ వేసుకున్నారు. ఇలాంటి వారిని వదిలి పెట్టకూడదని సోషల్ మీడియా అంతా ఏకమైతే వారిని అరెస్టు చేసి తీసుకొచ్చారు. వారు మూడో రోజే బెయిల్ తెచ్చుకుని ఉంచారు. ఇలాంటి వారు ప్రతీ చోటా ఉంటున్నారు. తాజాగా హిందీలో కామెడీ స్టార్లుగా చెప్పుకునే కొంత మంది నేరుగానే ఓ కార్యక్రమంలో కలిశారు. అక్కడ రణవీర్ అల్లాబడియా అనే యూట్యూబర్ ఓ జోక్ వేశాడు. అందరూ పగలబడి నవ్వారు. కానీ ఆ జోక్ ఎంత అసహ్యంగా ఉందంటే సోషల్ మీడియా మండిపోతోంది.
“నీ జీవితాంతం ప్రతిరోజూ నీ తల్లిదండ్రులు శృంగారం చేయడం చూస్తావా లేదా ఒక్కసారి అందులో చేరి శాశ్వతంగా ఆపేస్తావా?” అని తన తోటి యూట్యబర్ రణవీర్ అల్లాబడియా ప్రశ్నించారు. ఇదేం అని నెటిజన్లు ప్రశ్నిస్తే కామెడీని కూడా గుర్తించలేని సమాజం అని నిట్టూర్చి.. సారీ అంటున్నాడు. చేసిన ఘోరమైన వ్యాఖ్యలను చాలా సహజమే అన్నట్లుగా నవ్వుకుని.. చివరికి వివాదం అయితే సారీ అంటున్నారు. సోషల్మీడియా మొత్తం ఇలాంటి స్వేచ్చ ఉండాలా వద్దా అన్నదానిపై చర్చిస్తోంది. మహారాష్ట్ర సీఎం కూడా స్పందించారు. ఇలాంటి వాటిని సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మన దేశంలో వాక్ స్వేచ్చ ఉంది. అయితే మనకంటూ కొన్ని సంస్కృతి సంప్రదాయాలు, వావి వరసలు ఉంటాయి. వాటిని కూడా జోక్స్ చేసుకుంటూ పోతే.. ఇక సమాజం ఎటు పోతుంది ?. విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహించేందుకు వీరంతా కంకణం కట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వ్యూస్ కోసం.. ఫేమ్ కోసం ఇంతగా దిగజారిపోతున్న వైనం చూసి.. సమాజం నివ్వెర పోతోంది. కట్టడి చేయకపోతే ఎక్కడిదాకా వెళ్తుందో చెప్పడం కష్టమన్న ఆందోళన కనిపిస్తోంది.