స్వేచ్చ అనేది అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాలి కానీ..దిగజారిపోవడానికి కాదు. దిగజారిపోవడానికి ఉపయోగించుకునే స్వేచ్చను కట్టడి చేయాల్సిందే. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో కొంత మంది వికృత మనస్థత్వంతో దిగజారిపోతున్నారు. అది తమ స్వేచ్చ అంటున్నారు. పైగా కామెడీ అంటున్నారు. కామెడీని కామెడీగా చూడలేరా అంటున్నారు. వారు అన్న మాటల్ని వింటే సమాజంలో వీరు ఎలాంటి భావాలను.. భావజాలాన్ని కామెడీగా ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారో అర్థమైతే మాత్రం వాళ్లు ఎంత ప్రమాదకరంగా స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్నారో తెలిసిపోతుంది. ఇలాంటి వారిని అలా వదిలేయడం వల్ల సమాజానికి తీవ్ర హాని జరుగుతుంది.
రణవీర్ అల్లాబదియా – యూట్యూబర్ల విచ్చలవిడి మనస్తత్వానికి సాక్ష్యం
ఇప్పుడు హిందీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రణవీర్ అల్లాబదియా పేరే కనిపిస్తోంది. ఇతర యూట్యూబర్లతో కలిసి ఆయన పెట్టుకున్న ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తల్లిదండ్రులు శృంగారం చేస్తున్నప్పుడు చూడాలా లేకపోతే వారితో కలవాలా అన్నట్లుగా ఆయన వేసిన జోక్ చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆయన తీరుపై అందరూ ఖాండ్రించేసరికి..సారీ చెప్పారు. తన జోక్ ను అర్థం చేసుకోలేదని ఆయన చెప్పుకున్నారు. కానీ ఇతరులకు అర్థమైనా అనకపోయినా ఆయన మాత్రం పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ఆ మాటలు అన్నారు. అది ఎంత మానసిక వికృతం ?
తెలుగులోనూ ఉన్నారుగా.. ప్రణీత్ హనుమంత్ లాంటి ఉన్మాదులు !
ఈ వికృతం ఒక్క హిందీకే పరిమితం అయిందని అనుకోలేం. ఎందుకంటే కొద్ది రోజుల కిందట ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు..మరో నలుగురు తన మిత్రులతో కలిసి నాలుగేళ్ల చిన్న పిల్ల, తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు, నవ్వుకున్న విధానం చేసి.. దేశం అంతా బిత్తరపోయింది. వాళ్లేం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుని భయపడిపోయింది. వాళ్ల మెదళ్లలో ఇంత ఘోరమైన పురుగులు ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు. కానీ తమది కామెడీ అని వారు సర్ది చెప్పుకున్నారు.కానీ సమాజం అంతా తిరగబడేసరికి వారిపై కేసులు పెట్టారు. కానీ కేసులు పెట్టడం వరకూ ఓకే కానీ వారిని మార్చడం సాధ్యమా ?
కనీసం వావి వరసలు కాపాడుకోకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏముంటుంది?
పాశ్చాత్య దేశాల్లో విచ్చలవిడి జీవనం గొప్పగా భావించే కొంత మంది అదేమీ తప్పు కాదని ఆ భావజాలాన్ని ఇక్కడ రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ యూట్యూబర్లు తమ భావాలను కామెడీరూపంలో ప్రజెంట్ చేస్తున్నారు. అది తప్పు అనే ఏ కోశానా అనిపించుకోవడం లేదు. అక్కడే అసలు సమస్య వస్తోంది. వావి వరసల్ని కూడా కామెడీ చేసి అసభ్యంగా చిత్రీకరిస్తే అది సమాజానికి..కుటుంబ వ్యవస్థకూ ప్రమాదకరం. యూట్యూబర్లు అయినా ఇంకెవరైనా దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. కనీసం జంతువులం కాదు.. మనుషులం అన్న సంగతిని ఈ యూట్యూబర్లు గుర్తుంచుకుంటారో.. ఇంకా ఇంకా దిగజారిపోతారో కానీ.. వీరి వల్ల సమాజానికి జరుగుతున్న నష్టం మాత్రం తక్కువ కాదు.