వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న జగన్ సమీప బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి శుక్రవారం చికిత్స పొందుతూ చనిపోయినట్లుగా అధికారిక ప్రకటన చేశారు. నిజానికి ఆయన రెండు రోజుల కిందటే చనిపోయారని మీడియా వర్గాలకు వైఎస్ కుటుంబం నుంచి సమాచారం వచ్చింది. అయితే వివిధ కారణాలు చెబుతూ రెండు రోజుల పాటు లైఫ్ సపోర్టు కొనసాగించేలా చూసుకుని శుక్రవారం అధికార ప్రకటన చేశారు. ఇలా ఎందుకు చేశారన్నది మరో మిస్టరీ. సాధారణంగా ఆస్పత్రుల్లో ఇక హోప్స్ లేవు అనుకున్న వారికి వెంటిలేటర్, ఆక్సీజన్ వంటి ఏర్పాట్లను మంచి రోజు చూసుకుని తీసేస్తారు. అలా తీసేసి ఉంటారని భావిస్తున్నారు.
కానీ ముందుగానే ఎందుకు మీడియాకు సమాచారం ఇచ్చారన్నది సస్పెన్స్ గా మారింది. వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల కోసం జగన్ పులివెందుల వెళ్తున్నారు. లింగాల మండలానికి వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన విషయంలో జగన్ వ్యవహరించిన తీరుపై కుటుంబసభ్యుల్లోనూ అసంతృప్తి ఉందని చెబుతున్నారు కనీసం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయనను పరామర్శించడానికి వెళ్లకపోవడానికి కారణాలు ఏమిటన్న సందేహాలు కూడా వస్తున్నాయి.
డాక్టర్ అయిన ఆయన వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు సంఘటనాస్థలానికి వెళ్లారు. వివేకా మృతదేహానికి ఘోరమైన గాయాలు ఉన్నాయని కట్లు కూడా కట్టామని ఆయనఅప్పట్లో మీడియాతో చెప్పిన వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతరులు ఖండించారు. తాము ఎలాంటి కట్లు కట్టలేదని చెబుతున్నారు. ముఫ్పైల్లో ఉన్న అభిషేక్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆస్పత్రి పాలయ్యారని అంటున్నారు. ఎన్నికల్లో కూడా చురుగ్గా ఉన్న ఆయన.. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకు గురయ్యారు. హైదరాబాద్ లో సిటీ న్యూరో ఆస్పత్రిలో చాలా కాలం ఉంచారు. పరిస్థితి విషమించిన తర్వాత ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.