ఎవరైనా సీబీఐ అంటే భయపడతారు కానీ.. ఆ సీబీఐనే ఓ ఆటాడిస్తారు యెదుకూరి సందింటి వాళ్లు. ఆ విషయం అవినాష్ రెడ్డి మరోసారి నిరూపిస్తున్నారు. విచారణకు పిలిస్తే ఇదిగో వస్తున్నా అని ఇంటి నుంచి బయలుదేరుతారు. కానీ సీబీఐ ఆఫీసుకు చేరరు. మధ్యలో ఎక్కడికో వెళ్తారు. ఏదో ఓ కారణం చెబుతారు. మరోసారి అదే పని చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరు కాలేదు. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ఉదయం పది గంటల సమయంలో సీబీఐ విచారణకు బయలుదేరారు.
అయితే అదే సమయంలో ఆయనకు పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన తల్లి అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరారన్న సమాచారం వచ్చింది. దీంతో ఆయన సీబీఐ విచారణకు రాలేనని.. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పులివెందులకు వెళ్తున్నానని సీబీఐ అధికారులకు లేఖ రాసి .. హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. ఆయన పులివెందుల వెళ్తున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే అవినాష్ రెడ్డి రాసిన లేఖ విషయంలో సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించలేదు. అవినాష్ రెడ్డి తీరుపై సీబీఐ సీరియస్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
మరో వైపు సీబీఐ కోర్టు వద్ద అవినాష్ రెడ్డి అనచరులు మీడియా ప్రతినిధులపై దాడులు చేశారు. అవినాష్ రెడ్డి విచారణకు వస్తారని తెలియడంతో పలువురు మీడియా సంస్థల ప్రతినిధులు వచ్చారు. అక్కడకు పెద్ద ఎత్తున పులివెందుల నుంచి వచ్చిన అవినాష్ రెడ్డి అనుచరులు కూడా గుమికూడారు. అవినాష్ రెడ్డి రావడం లేదని విషయం తెలిసిన తర్వాత మీడియా కవరేజీ ఇస్తున్న వాహనాలపై దాడి చేశారు. ఓ తెలుగు మిడియా చానల్ వాహనాన్ని.. కెమెరాలను ధ్వంసం చేశారు. ఇద్దరు ప్రతినిధుల్ని కూడా గాయపరిచారు.
అవినాష్ రెడ్డి వ్యవహారం సీబీఐ అధికారులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. సీబీఐని ఇంత కామెడీ చేస్తున్నారేమిటని ఇతరులూ చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. మరి సీబీఐ అధికారులు తదుపరి ఏం చర్యలు తీసుకుంటారో ?