అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ కాకూడదని చేస్తున్న ప్రయత్నాలు ఏ రేంజ్లో ఉంటున్నాయో ఊహించడం కష్టం. తెర వెనుక విజయ్ కుమార్ స్వామిజీ దగ్గర్నుంచి పరిమళ్ నత్వానీ వరకూ ప్రయత్నిస్తున్నారని మీడియాలో ప్రచారం జరుగుతూంటే కోర్టులో లోపల .. రాజ్యసభ సభ్యుడు ప్లస్ జగన్ తరపున న్యాయవాద వర్గాలకు ప్రతినిధిగా వ్యవహరించే లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టులో తీవ్రంగా శ్రమించారు. ఆయనను అరెస్ట్ చేయకుండా .. కస్టోడియల్ ఇంటరాగేషన్ చేసుకోవచ్చని కొత్త ఆఫర్ న్యాయమూర్తి ముందుపెట్టారు. సుప్రీం కోర్టు గతం లో ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇలాంటి ఆదేశాలు ఇస్తే మేము తప్పకుండా పాటీస్తామన్నారు. అవినాష్ పై ఎలాంటి కేసులు లేవని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరో వైపు కోర్టులో విచారణ సందర్భంగా అలా అయితే ఇలా జరిగి ఉండాలి కదా.. ఇలా జరిగితే అలా జరిగి ఉండాలి కదా అంటూ.. నిరంజన్ రెడ్డి చాలా సేపు వాదించారు. తర్వాత సునీత లాయర్ కూడా వాదించారు. అవినాష్ రెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నారన్నదానికి ఆధారాలను చూపించారు. అందుకే సుప్రీంకోర్టు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిందన్నారు. అవినాష్ రెడ్డిపై కేసులు లేకపోవడం ఏమిటని ఎన్నికల అఫిడవిట్ లోనే నాలుగు కేసులు ఉన్నాయని సునీత తరపు లాయర్ గుర్తు చేశారు.
ఈ విచారణ ప్రారంభం కాక ముందే గుర్తు తెలియని ప్రదేశం నుంచి అవినాష్ రెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఎప్పట్లాగే ఆస్థాన మీడియా సాక్షి చెప్పే కథల్ని చెప్పారు. అసలు వివేకా హత్య అనే విషయాన్ని తనకు ఎవరూ చెప్పలేదని అందుకే అది గుండెపోటు అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తనను ప్లాన్డ్ గా ఇరికించారని నమ్మబలికే ప్రయత్నం చేశారు. అసలు ఊహకు కూడా అందని విషయాన్ని కళ్లార్పకుండా చెప్పి తనకే పాపం తెలియదని అవినాష్ రెడ్డి వీడియోలో విన్నవించుకున్నారు. అయితే తన ప్రమేయం లేదని.. సీబీఐకి చెప్పుకోవాలి .. నిరూపించుకోవాలి కానీ ఇలా వీడియోలు రిలీజ్ చేయడం ఏమిటన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది. అదే మ్యాజిక్ అని.. వైసీపీవర్గాలు కూడా సెటైర్లు వేసుకుంటున్నాయి.