ఆరు నెలల సమయం ఇవ్వండి.. మంచి సీఎంగా నిరూపించుకుంటా..! … వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార వేదిక పై నుంచి చేసిన విజ్ఞప్తి ఇది. ఇప్పుడు ఆరు నెలలు అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఆరు నెలల కాలంలో ఆయన చెప్పినట్లుగా.. మంచి సీఎం అనిపించుకునే పద్దతిలో… సాగలేదని.. ఆరు నెలల్లో జరిగిన పరిణామాలు.. ఆయన హామీలు అమలు చేసిన విధానం… ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా.. నిర్ణయాలు తీసుకున్న వ్యహారాల్లో స్పష్టంగా తేలిపోతుంది. తన మేనిఫెస్టోను ఆయన బైబిల్ లా.. ఖురాన్ లా… భగవద్గీతగా భావించిఅమలు చేస్తానని ప్రకటిస్తూంటారు. ఈ క్రమంలో మొదటగా మేనిఫెస్టోలో ఏమేం అమలు చేశారో పరిశీలిస్తే… ప్చ్ అనిపించక మానదు
మేనిఫెస్టో ” బైబిల్ ” అమలు ఇంకా జీవోల్లోనే..!
నవరత్నాలు కానీ.. మేనిఫెస్టోలో చెప్పిన ఇతర హామీలు కానీ.. పాదయాత్రలో ఇచ్చిన ఇతర హామీల విషయంలో కానీ.. జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల కాలంలో అమలు చేసినవి అతి తక్కువ. నవరత్నాల్లో జగన్ చెప్పే మొట్టమొదటి రత్నం.. రైతు భరోసా. ఈ పథకాన్ని నాలుగేళ్ల కిందటే.. అంటే… కేంద్రం కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రకటించక ముందే జగన్ ప్రకటించారు . ప్రతీ రైతుకు ఒకే సారి రూ. 12500 ఇస్తామన్నారు. ఎన్నికల సభల్లోనూ అదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేంద్రం కిసాన్ సమ్మాన్ కింద ఇస్తున్న రూ. ఆరు వేలు తన ఖాతాలో వేసుకున్నారు. అవి కాకుండా.. రూ. ఆరు వేల ఐదు వందలే ఇస్తామన్నారు. తీరా అమలు సమయానికి వచ్చే సరికి.. మరో వెయ్యి పెంచి.. మూడు విడుతలుగా ఇస్తామని పథకాన్ని మార్చేశారు. దాంతో.. రైతుల్లో నిరాశ ఏర్పడింది. అంతే కాదు.. కౌలు రైతులు, ఇతర రైతులకు లక్షల మందిని అనర్హుల్ని చేశారు. ఇది రైతుల్లో మరింత ఆగ్రహానికి కారణం అయింది. ఇక నవరత్నాల్లో మిగిలిన ఎనిమిది రత్నాలు ఇంకా అమలు ప్రారంభం కాలేదు. ప్రతి తల్లికి రూ. పదిహేను వేలు ఇచ్చే అమ్మ ఒడి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద ఇస్తామన్న రూ.75 వేలు, పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్, డ్వాక్రా మహిళల రుణమాఫీ, అందరికీ ఆరోగ్యశ్రీ లాంటివేమీ అమలు కాలేదు. ఏడాదికి.. ప్రతీ కుటుంబానికి రూ. లక్ష నుంచి ఐదు లక్షల వరకూ లబ్ది కలిగిస్తామని జగన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఈ ఆరు నెలల్లో…కనీసం..నాలుగైదు శాతం కుటుంబాలకు కూడా.. అందులో పది శాతం కూడా లబ్ది పొందలేదు.
అమలు చేయలేని పథకాలపై మేము హమీ ఇవ్వలేదనే ఎదురుదాడికి ప్రాధాన్యం..!
ఇవిమాత్రంమే కాకుండా..ప్రజలకు ఇచ్చిన హామీలను..జగన్ నెరవేర్చలేకపోయారు. అగ్రిగోల్డ్ విషయంలో.. తొలి ఆరు నెలల్లో రూ.1150 కోట్లు ఇచ్చి.. అందరర్నీ ఆదుకుంటానని ప్రకటించారు. ఆరో నెలలో రూ. 260 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతావి.. త్వరలో ఇస్తామన్నట్లుగా చెప్పుకొచ్చారు. అలాగే.. తాను అధికారంలోకి వచ్చిన వారంలో ఉద్యోగుల పెన్షన్ విధానం.. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. ఆరు నెలలైనా కమిటీల మీద కమిటీలు వేస్తూ వెళ్తున్నారు. అలాగే… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఆరు నెలల కిందట నిర్ణయం తీసుకున్నారు కానీ.. ఇంత వరకూ అడుగు ముందుకు పడలేదు. రేషన్ కార్డుపై సెప్టెంబర్ నుంచి అందరికీ సన్నబియ్యం ఇస్తామన్నారు. తర్వాత తాము అసలు సన్నబియ్యం హామీ ఇవ్వలేదన్నారు. నాణ్యమైన బియ్యం ఇస్తామన్నారు. అది కూడా.. వచ్చే ఏప్రిల్ నుంచి అని మాట మార్చారు. ఇక పాదయాత్రలో ఇచ్చిన చిన్నా.. చితకా హామీలు నెరవేర్చాలంటూ.. పెద్ద ఎత్తున సీఎం ఇంటి వద్దకు… ఆయా వర్గాలు వస్తున్నాయి. కానీ వారి గోడు వినేవారు లేరు.
అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా రద్దు మైనస్..!
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. గత ప్రభుత్వం అమలు చేసిన మంచి … ప్రజలకు లాభం కలిగే సంక్షేమ పథకాలను కొనసాగిస్తుంది. పేరు మార్చి అయినా కొనసాగిస్తుంది. అయితే.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం.. అలాంటి మొహమాటాలు పెట్టుకోలేదు. తాము అమలు చేసే సంక్షేమ పథకాలు మాత్రమే.. ఉంటే చాలనుకుంది. నవరత్నాలు మేనిఫెస్టోల్లో ఉన్నవి మాత్రమే అమలు చేస్తామంటూ.. మిగతా పథకాలు మొత్తాన్ని ఆపేసింది. అలాంటి వాటిలో..ప్రజల్లో చెడ్డపేరు తెచ్చి పెట్టిన పథకం రద్దు.. అన్న క్యాంటీన్లు. అన్న క్యాంటీన్లు పేద ప్రజల కడుపు నింపుతున్నాయని… భావించారు. వాటిని రద్దు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రారంభిస్తామని మంత్రులు చెప్పారు. కానీ.. ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. అలాగే.. చంద్రన్న బీమా.. కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. ఆదుకునేది. దాన్ని కూడా నిలిపేవేశారు. ఇక ప్రతి పండగకు.. ఉచితంగా.. రేషన్ కార్డు దారులకు పండుగ చేసుకునేందుకు సరుకులు ఇచ్చేవారు…వాటినీ కూడా నిలిపివేవేశారు. బీసీల కోసం ఆదరణలాంటి పథకాలన్నీ.. నిలిచిపోయాయి.
Read also : 6 నెలల పాలన : పాలనలో ముద్ర వేసేందుకు జగన్ మొదటి అడుగులు..!
పారిశ్రామికంగా కుప్పకూలిన ఏపీ..!
ఆరు నెలల కాలంలో.. జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక పరంగా.. వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా… చంద్రబాబు హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అనేక సంస్థలు వెనక్కి వెళ్లిపోయారు. ఆరు నెలల్లో కొత్తగా వచ్చిన ఒక్క పరిశ్రమ కూడా లేదు. కానీ.. భారీ పరిశ్రమలు మాత్రం వెనక్కి వెళ్లిపోయాయి. కచ్చితంగా 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనడం దగ్గర్నుంచి.. అనేక పారిశ్రామిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇష్టం వచ్చినట్లుగా.. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన వారి భూముల్ని రద్దు చేయడంతో.. ఇన్వెస్టర్లలో ఏపీ పై విశ్వాసం సన్నగిల్లింది. ఇక ముందు.. ఏపీకి ఏదైనా భారీ పరిశ్రమ రావడం కష్టమేనన్న చర్చ భారత పారిశ్రామికవర్గాల్లో నడుస్తోంది. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లపై ప్రభుత్వ విధానం .. అంతర్జాతీయంగా చెడ్డపేరు తీసుకు వచ్చింది. కేంద్రం చెప్పినా… ఏపీ సర్కార్ వాటిపై తమ పంతం వీడటం లేదు. దీంతో.. ఏపీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ కు వెళ్లేందుకు ఇతర దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
తెలంగాణకు అప్పనంగా ఇచ్చేశారు కానీ.. తెచ్చినవి ఏమున్నాయి..?
సీఎం జగన్.. ప్రమాణస్వీకారం చేయక ముందు నుంచే… తెలంగాణ సర్కార్‌తో మంచి సంబంధాలు నెలకొల్పుకున్నారు. ఫలితాలు రాగానే..కేసీఆర్ వద్దకు వెళ్లారు. గోదావరి నీటిని తరలించేందుకు ఉమ్మడి ప్రాజెక్టు కోసం వరుస సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలను… కేబినెట్ ఏర్పడక ముందే ఇచ్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా వెళ్లారు. కానీ.. ఏపీకి సంబంధించి.. రావాల్సిన ఒక్కటంటే.. ఒక్క ప్రయోజనాన్నీ.. సాధించలేకపోయారు. కనీసం.. కరెంట్ బకాయిలు.. ఉమ్మడి సంస్థల విభజన కూడా.. చేయలేకపోయారు. ఇప్పుడు.. కేసీఆర్ తో .. అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఏపీకి రావాల్సిన వాటిని అడిగే పరిస్థితి కూడా ఉండన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపిస్తోంది.
Read also : 6 నెలల పాలన : 6 వారాల కమిటీలెన్ని వేసిన అవినీతిని బయట పెట్టలేదేం..?
ఆరు నెలల పాలనను విశ్లేషించుకుంటే.. విజయాల కన్నా.. వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయి. అనుభవం లేని ముఖ్యమంత్రికి.. ఇప్పటికి ఆరు నెలల అనుభవం వచ్చింది.ఈ ఆరు నెలల పాలనా పాఠాలను నేర్చుకుని.. ముందుకు సాగితే.. నాలుగున్నరేళ్లు ఆయన ప్రజలకు తిరుగులేని పాలన అందించవచ్చు.