వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. ఫ్రస్ట్రేషన్ లోకి పోతున్నారు. చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించడానికి వెనుకాడటం లేదు. గతంలో.. కాల్చి చంపినా తప్పు లేదని వ్యాక్యానించారు. ఆ తర్వాత.. బావిలో దూకి చావాలంటూ శాపనార్ధాలు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబును దున్న అంటూ.. తిట్టడం ప్రారంభించారు. తిరుపతిలో శంఖారావం సభ పెట్టి.. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజలకు సినిమా చూపిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. అవన్నీ తాను.. పాదయాత్రలో చూశానన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తానని ప్రజలకు సభాముఖంగా హామీ ఇచ్చారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలుకావడం లేదని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఈ మనిషిని అన్న అనాలా? దున్న అనాలా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాను ఇచ్చిన హామీలన్నింటినీ కాపీకొట్టి అమలు చేస్తున్నారని మండిపడ్డారు. వృద్ధాప్య పించన్ చంద్రబాబు రెండు వేలిస్తున్నారని కాబట్టి తాను మూడు వేలిస్తానని ప్రకటించారు.చంద్రబాబు అమలు చేస్తున్న వాటి కంటే ఎక్కువే ఇస్తానని ప్రకటించారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని జగన్ ఆరోపించారు. తనది కాని బడ్జెట్ను చంద్రబాబు ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. ప్రజలు ఆదరిస్తే ఆ బడ్జెట్ మనదవుతుందని.. పిలుపునిచ్చారు. ఐదేళ్ల క్రితం చంద్రబాబును నమ్మి మోసపోయామన్నారు. పోలవరం కట్టకుండానే జాతికి అంకితం చేస్తున్నారని ..నల్ల చొక్కా వేసుకుని చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ధర్మానికి, అధర్మానికి మధ్య ఈ ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. పసుపు- కుంకుమ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారంటున్నారు. చంద్రబాబు జనానికి మూడు సినిమాలు చూపిస్తున్నారని విమర్సించారు.
వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని.. జగన్ ఆరోపించారు. బీజేపీతో పోరాటం చేస్తున్నట్లు చంద్రబాబు డ్రామాన్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని చంద్రబాబు లూటీ చేశారని విమర్శించారు. చంద్రబాబుపై ఏక వచనంతో.. ఘాటుగా విమర్శలు చేయడంతో పాటు.. హామీలు కూడా డబుల్ చేసి.. ఆకట్టుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి.