ఈ కోణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు ఆలోచిస్తారో లేదో తెలీదు! ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న సంకేతాలేంటో, దానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటనే సరైన ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారో లేదో తెలీదు! కానీ, జగన్ పాదయాత్ర చేసుకుంటూ.. హామీలు ఇచ్చుకుంటూ… టీడీపీ పాలనపై రోజూ ఆరోపణలు చేస్తూ… ఆధారాల ఊసెత్తకుండా అవినీతి అంటూ.. ‘మారిపోవాలీ మారిపోవాలీ’ అంటారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాలో జరుగుతోంది.
శనివారం నాడు నర్సీపట్నంలో మాట్లాడుతూ… ఇలాంటి దోపిడీ పాలన ఇంకా కావాలా అంటూ ప్రజలను ప్రశ్నించారు. మోసం, అవినీతి, అబద్ధాలతో కూడిన చంద్రబాబు పాలనను ఇన్నాళ్లూ చూశారన్నారు. ఇంకో ఆర్నెల్లలో ఎన్నికలు రాబోతున్నాయనీ, ఈ సందర్భంగా ప్రజలను తాను కోరేది ఒకటేననీ… ఎలాంటి నాయకుడు కావాలో గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించాలని జగన్ కోరారు. ఏ నాయకుడైనా ఫలానా పని చేస్తానని చెప్పి, చెయ్యలేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలన్నారు. అలాంటి మార్పు రావాలంటే జగన్ ఒక్కడి వల్లే సాధ్యం కాదనీ, ప్రజలందరి ఆశీస్సులూ ఉండాలని జగన్ కోరారు.
అంటే, జగన్ కోరుకునే మార్పేంటి… ఇచ్చిన హామీలు నెరవేర్చలేనివారు, వెంటనే రాజీనామా చేసి ఇంటికెళ్లిపోవాలట! ఒక పార్టీ అధికారంలో ఐదేళ్లు ఉంటుంది కదా! ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి.. ఆపార్టీకి చివరిరోజు వరకూ అవకాశం ఉంటుంది. ఈలోపే, హామీలు అమలు చెయ్యలేదని రాజీనామా చేయాలని ఎలా మెజర్ చేస్తారు..? వ్యవస్థలో అలాంటి కొలమానాన్ని ఎక్కడ పెడతారు..? జగన్ కోరుకుంటున్న మార్పును ప్రాక్టికల్ కోణం నుంచి చూస్తుంటే… హామీలు అమలు చెయ్యడానికి ఐదేళ్లు టైమున్నప్పుడు, మధ్యలో రాజీనామా చేసి వెళ్లిపోయే తరహా పరిస్థితి ఎలా సాధ్యమౌతుందనేది అర్థం కావడం లేదు..? ఒక నాయకుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాడా, ఎందుకు నెరవేర్చలేకపోయాడూ, మరోసారి అవకాశం ఇస్తే నెరవేర్చగల సమర్థత ఆ నాయకుడికి ఉందా… ఇలాంటివన్నీ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించదగ్గ అంశాలు.
జగన్ కోరుకుంటున్న ఈ ‘మార్పు’ ఏంటనేది సామాన్యులకు అర్థం కావడం లేదు! ఇంకోటి… ఆ మార్పు జగన్ ఒక్కడివల్లే సాధ్యం కాదంటారు, జనం రావాలంటారు! జనానికి అర్థమయ్యేట్టు చెప్పలేని ఆ మార్పు కోసం… జగన్ వెంట జనాలు రావాలంటే ఎలా వస్తారు..? రాజకీయాల్లో విశ్వసనీయత, నిజాయితీ రావాలంటారు. కానీ, తాను వాటిని ఎలా తెస్తానో, ప్రాక్టికల్ గా వాటిని తెచ్చేందుకు తానేం చెయ్యబోతున్నాననేది కూడా జగన్ చెప్పడం లేదు. మార్పు, విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధత… ఇలాంటి పడికట్టు పదాలు ఎన్నైనా మాట్లాడొచ్చు. కానీ, వాటిని పాలనలోకి ఎలా తెస్తారనే వివరణ, విజన్ ప్రజలకు కావాలి. జగన్ పాదయాత్ర 239 రోజులు దాటినా… వాటిపై ఇంకా స్పష్టత ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు. కానీ, తన వెంట అందరూ వచ్చేయాలీ, ఆశీర్వదించేయాలంటారు, ఎలా..?