కరోనా వైరస్ కూడా జ్వరం, ఫ్లూ లాంటిదేనని.. ఎవరూ భయపడవద్దని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. ఏపీలో ఒక్కసారిగా కరోనా కేసులు 87కి చేరడంతో.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన ఓ రికార్డెడ్ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రజలకు ధైర్యం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. రెండురోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగాయని.. అవన్నీ.. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారివెనన్నారు. సదస్సుకు వచ్చిన విదేశీయుల నుంచి మనవారికి వైరస్ సోకిందని.. ఢిల్లీ సదస్సుకు వెళ్లిన ప్రతి ఒక్కరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఢిల్లీ మీటింగ్‌కు ఏపీ నుంచి 1,085మంది వెళ్లి వచ్చారని.. మొత్తం 585మందికి పరీక్షలు చేశామని.. 70 కేసుల్లో పాజిటివ్ వచ్చిందన్నారు. మరో 500 కేసుల నివేదికలు రావాల్సి ఉందన్నారు.
ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో 21మంది ఆచూకీ తెలియలేదని.. వారి కోసం గాలిస్తున్నామని సీఎం ప్రకటించారు. వారు ఎక్కడ ఉన్నా.. 104కు ఫోన్ చేసి స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ జ్వరం, ఫ్లూ లాంటిదే, ఎవరూ భయపడొద్దని .. వృద్ధులు, డయాబెటిస్, ఇతర సమస్యలున్నవారికి తీవ్రంగా ఉంటుందన్నారు. కరోనా పట్ల అధైర్యపడొద్దు, ఆందోళన చెందవద్దని సూచించారు. విదేశాల్లో దేశాధినేతలకు కూడా కరోనా సోకింది, నయమైందని గుర్తు చేశారు. కరోనా వస్తే తప్పుజరిగినట్లు భావించకూడదని .. వారితో ఆప్యాయంగా వ్యవహించాలని సూచించారు. ప్రజలకు ధైర్యం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి… కరోనా తీవ్రతను తగ్గించి చెప్పేందుకు ప్రయత్నించినట్లుగా కనిపిస్తోంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా స్పందించారు. అనుకోని ఖర్చులు విపరీతంగా పెరిగాయని.. అనుకోని భారం పడిందని … జీతాలు వాయిదా వేసేందుకు సహకరించిన… ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మూడు సార్లు మీడియా ప్రతినిధుల్ని పిలిచి మీడియా సమావేశాలు నిర్వహించినప్పటికీ.. ప్రశ్నలు వేయనివ్వలేదు. అయినప్పటికీ.. కొన్ని కొన్ని అంశాల్లో తడబడటంతో.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వచ్చాయి. ఈ సారి అలాంటి పరిస్థితి లేకుండా… రికార్డెడ్ టేప్‌ను విడుదల చేశారు.