గ్రామ, గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో పది మంది నియామకాల కోసం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రక్రియ నిర్వహిస్తోంది. చాలా వరకు గ్రామ వలంటీర్ల పోస్టులు ఉద్యోగం కాదని… సేవా దృక్పధంతో చేసే వారికి మాత్రమేనని… అధికారులు మాత్రమే కాదు.. వైసీపీ నేతలు కూడా చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. కేవలం వారికి గౌరవ వేతనంగా రూ. ఐదు వేలు ఇస్తామని చెబుతున్నారు. అందుకే.. ఓ పద్దతి లేకుండా.. ఇష్టా రీతిన.. నియామకాలు చేస్తున్నారు. ఎక్కడా రిజర్వేషన్లు.. ఇతర విషయాలు అవసరం రాకుండా.. ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఇప్పుడు.. ఇవన్నీ.. శాశ్వత ఉద్యోగాలని సీఎం జగన్మోహన్ రెడ్డి.. ట్విట్టర్ ద్వారా ఘనంగా ప్రకటించుకోవడమే… ఆశ్చర్యం రేకెత్తిస్తోంది.
పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు… మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామని ట్వీట్ చేశారు. అంటే.. వలంటీర్లుగా నియమిస్తున్న వారిలో… 1,33,494 మంది శాశ్వత ఉద్యోగులని నేరుగా చెప్పారు. మిగతా వాళ్లు కూడా ఉద్యోగులేనని.. తాము ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇస్తున్నానని.. సీఎం నేరుగా చెప్పుకున్నట్లయింది. మరి శాశ్వత ఉద్యోగాలివ్వాలంటే.. దానికో ప్రక్రియ ఉంటుంది. ప్రభుత్వం అయినా ఇష్టారీతిన ఎంపిక నిర్వహించడానికి అవకాశం లేదు. రిజర్వేషన్లు సహా.. వివిధ రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేమీ పాటించకుండానే.. శాశ్వత ఉద్యోగుల్ని ప్రభుత్వం నియమించేసుకుంటుందన్నమాట.
నిజానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే.. దానికో గ్రేడ్ ఉండాలి. ఏ పొజిషన్లో తీసుకుంటున్నారో.. స్పష్టమైన అపాయింట్మెంట్ ఉండాలి. ఆ ఉద్యోగానికి కనీస వేతనం సహా.. ఇతర సౌకర్యాలు కల్పించాలి. అవేమీ లేకుండా.. రూ. 5వేల జీతం పేరుతో వలంటీర్ ను నియమంచుకుని… ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేశామని చెబితే.. మరీ అతిశయోక్తిగా ఉంటుంది. ఇప్పటికే.. వలంటీర్ల ఎంపిక ప్రక్రియపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కేవలం వైసీపీ కార్యకర్తలను మాత్రమే.. నియమిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు.. వారందర్నీ శాశ్వత ఉద్యోగులుగా చేసే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం… నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది.