ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించే అంశంపై టెన్షన్ పడుతోంది. ఇతర అన్ని రాజకీయ పార్టీలు.. మీటర్లు పెడితే బద్దలు కొడతామని ప్రకటించాయి. జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రూ. నాలుగు వేల కోట్లు తీసుకుని.. రైతులపై మీటర్ల భారం వేస్తున్నారని ప్రజల్లోకి బలంగా వెళ్లింది. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఇదే విషయాన్ని అక్కడి ఉపఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి కొత్త టెన్షన్ ప్రారంభమయింది. రైతుల్లో వ్యతిరేకత వస్తే.. అది ఏ స్థాయికి వెళ్తుందో అంచనా వేయడం కష్టం.
అయితే ప్రభుత్వం మాత్రం.. ఈ నిర్ణయం విషయంలో వెనుకడుగు వేసే అవకాశం లేదు. ఇప్పటికే కేంద్రానికి షరతులు అంగీకరించేసినట్లుగా తెలిపింది. ఆర్థిక సాయం కూడా పొందడం ప్రారంభించింది. కానీ.. పరిస్థితి చూస్తూంటే.. రైతులకు సర్ది చెప్పకపోతే పరిస్థితి చేయి దాటుతుందనే భయం వైసీపీ నేతలలో ప్రారంభమయింది. అందుకే… మీటర్ల వల్ల నాణ్యమైన విద్యుత్ వస్తుందని చెప్పాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ప్రచార కార్యక్రమాలను నిర్దేశించారు. రైతులకు ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో.. సమీక్షా సమావేశంలో అధికారులకు వివరించారు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఒక్క రూపాయి భారం పడదని.. ఉదయం పూటే తొమ్మిది గంటల విద్యుత్ వస్తుందన్న విషయాన్ని చెప్పాలంటున్నారు.
అయితే రైతుల్లో వస్తున్న అనేక సందేహాలు తీర్చడానికి ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీటర్లు పెడితే.. వచ్చే సమస్యలు మామూలుగా ఉండవు. మీటర్లు కాలిపోవడం అనే సమస్య సహజగంగా వస్తూ ఉంటుంది. ఇలా మీటర్లు కాలిపోయినప్పుడు రైతులు నానా తంటాలు పడాలి. పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకోవాలి. లంచం ఇస్తే కానీ విద్యుత్ అధికారులు కొత్త మీటర్లు పెట్టరు. ఇలాంటి సమస్యలన్నీ గతంలో రైతులు అనుభవించారు. అందుకే ఇప్పుడు వారు ఆందోళన చెందుతున్నారు. మీటర్లు కాలిపోయినా ఉచితంగా పెడతామని ప్రభుత్వం చెబుతోంది. కానీ.. విపక్షాలు ధ్వంసం చేస్తామని అంటున్నాయి. ఎన్ని ధ్వంసం చేస్తే అన్ని కొత్త మీటర్లు పెట్టడం సాధ్యం కాదు. ఒక వేళ మీటర్ ధ్వంసం అయిన పొలం రైతుపై కేసులు పెడితే.. అదో రాజకీయ రగడ అయిపోతుంది.
జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ప్రజలు అంగీకరిస్తారన్న గుడ్డి నమ్మకంతో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లుగా వైసీపీ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ విషయంలో సానుకూలంగా బయటపడకపోతే… ఇబ్బంది పడతామని అనుకుంటున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రణాళిక ఈ సమస్య తీరుస్తుందో లేదో చూడాలి..!