ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర నేటితో ముగుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఇవాళ్ల భారీ బహిరంగ సభను వైకాపా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జగన్ చేసిన పాదయాత్రను చారిత్రకం, అజరామరం, అద్భుతం, నభూతో నభవిష్యతి అనే స్థాయిలో వైకాపా శ్రేణులు ఉత్సాహంగా చెప్పుకుంటున్నాయి. ఇక, ఈ సందర్భంగా ‘కొత్త చరిత్రకు శ్రీకారం’ అంటూ ఆ పార్టీ పత్రిక ఒక ఎడిటోరియల్ రాసింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా జగన్ వెనక్కి తగ్గలేదనీ, ఉత్సాహంతో ఆయన సాగించిన యాత్రను చూసి ప్రజలే అబ్బురపోయారన్నారు. జగన్ ఏం చెబుతారో అని చూసేందుకు జనాలు తరలి రావడం దేశ చరిత్రలోనే అపూర్వం అని రాశారు!
యాత్ర పొడవునా వందలు, వేల మంది జగన్ కు తమ గోడు వినిపించుకున్నారనీ, ఓపికగా అందరి కష్టాలూ విన్నారనీ, ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినవారంతా జగన్ ను కలిశారనీ, జగన్ ను కలిశాక వారిలో విశ్వాసం కనిపించిందని రాశారు. ప్రజల కష్టాలను ఓపికతో విన్న జగన్… పరిష్కార మార్గాలు ఆలోచించారనీ, సరికొత్త విధానాలను రూపకల్పన చేశారనీ, కొద్దిరోజులు ఓపిక పట్టాలనీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కష్టాలన్నీ తీరిపోతాయని జగన్ ప్రజలకు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. జగన్ పాదయాత్ర విజయవంతం కావడం అసాధ్యమని మొదట్లో టీడీపీ అనుకుందనీ, జగన్ ఆత్మస్థైర్యాన్ని చూసి చివరికి చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోయారనీ, యాత్రకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారనీ, దానికి పరాకాష్టే విశాఖలో జగన్ పై దాడి అని ముక్తాయించారు.
జగన్ పాదయాత్ర చారిత్రకం అంటున్నారు సరే.. ఎలా చారిత్రికం అనే స్పష్టతే కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సమస్యలతో ఉన్నారనీ, అధికార పార్టీ విధానాలతో విసిగిపోతున్నామని ప్రజలు చెబుతుంటే… అలాంటివారిందరికీ జగన్ ఇచ్చిన భరోసా ఏంటి… తాను ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆగమని! అంటే, ప్రతిపక్ష నేతగా తన వైఫల్యాలన్ని ప్రజలముందు ఒప్పుకుంటున్నట్టే కదా. ప్రతిపక్షంగా ఉంటూ ప్రజలకు అవసరమైన అంశాల కోసం ఏనాడైనా పోరాటం చేశారా..? చారిత్రకం అనుకుంటున్న ఈ పాదయాత్ర కూడా చేసింది కేవలం తాను ముఖ్యమంత్రిని కావాలనే లక్ష్యంతోనే కదా! గతంలో ఇదే విధంగా యాత్ర చేసి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి… అదే సెంటిమెంట్ ను కొనసాగించి తానూ సీఎం కావాలనే ఉద్దేశంతోనే యాత్ర చేసింది.
యాత్ర పూర్తయింది.. ఈ సందర్భాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు, ఓకే. కానీ, వందల వేలమంది జగన్ కు సమస్యలు చెప్పుకున్నవారంతా ఇప్పుడెక్కడున్నట్టు… అవే సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నట్టే కదా! వారందరితో జగన్ విశ్వాసం నింపేశారని అంటున్నారు. సమస్యలకు పరిష్కారం అంటే విశ్వాసం నింపడమే సరిపోదు. వారి తరఫున పోరాడాలి, వారి గొంతును వినిపించాలి. కానీ, ఇవాళ్ల వైకాపా శ్రేణులు చేసుకుంటున్న సంబరాలన్నీ ప్రజల కష్టాల కోణం నుంచి లేవు. జగన్ చరిత్ర సృష్టించారనే మాట్లాడుతున్నారు. ఈ సంబరాల్లో ప్రజల కష్టాల కంటే, జగన్ పాదయాత్ర పూర్తిచేయడమే కష్టసాధ్యమైన పని అన్నట్టుగా చూస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ప్రజల పక్షాన నిలబడి పోరాడలేకపోయారు. జగన్ కి తెలిసిన పోరాటం… అధికారం ఒక్కటే! తాము అధికారంలోకి రాబోతున్నామన్న విశ్వాసాన్ని తమలో తాము నింపుకోవడం కోసం చేసిన యాత్రే… ఈ ప్రజాసంకల్ప యాత్ర. ఈ సంకల్పం ప్రజలదికాదు.. ముఖ్యమంత్రి కావాలనే జగన్ ఒక్కరిది మాత్రమే.
భావోద్వేగాలకు లోనుకాకుండా ఆలోచిస్తే… జగన్ యాత్ర సాధించిందేంటనేది ప్రతీ ఒక్కరికీ అర్థమౌతుంది. అవే భావోద్వేగాలను అడ్డం పెట్టుకుని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం జగన్ చేశారు. నాయకుడికి ఎమోషన్ ఉండటంలో తప్పులేదు, కానీ దానికి విజన్ తోడు కాకపోతే అది కేవలం వ్యక్తుల మధ్య సంబంధంగానే మిగిలిపోతుంది. వ్యవస్థను మార్చే ఐడియాలజీగా రూపాంతరం చెందదు. ఈ తేడా తెలిస్తే.. జగన్ పోరాటం చేసేవారు. కానీ, యాత్ర మాత్రమే చేశారు.