లక్ష్యం సుదూరంగా ఉంటే ..” ఎంతెంత దూరం.. చాలా చాలా దూరం..” అనుకుంటూ వెళ్తారు పిల్లలు. అలా అనుకుంటే.. చాలా త్వరగా లక్ష్యాన్ని చేరుకోవచ్చని వారి ఆశ. కానీ అలా అనుకున్నా.. అనుకోకపోయినా… వడిచే విధానం వల్లనే… లక్ష్యానికి దగ్గరవుతున్నారు. మరి పధ్నాలుగు నెలల పాటు నడిచిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తాను కోరుకున్న లక్ష్యానికి దగ్గరయ్యారా..? మౌలికమైన విషయాలన్నింటినీ తొక్కి పెట్టి దూరమయ్యారా..? జగన్ పాదయాత్రతో సాధించిందేమిటి..?
సీఎం కుర్చీ దగ్గరకు పాదయాత్ర చేసినట్లేనా..?
341 రోజులు…3వేల 648 కిలోమీటర్లు, 134 నియోజకవర్గాలు… అంకెల్లో చెప్పాలంటే.. జగన్ పాదయాత్ర ఇదే. కోర్టుకు వెళ్లేందుకు.. పండుగలు, సెలవులు, ఇతర ఇబ్బందుల కారణంగా… ఆయన నడవని రోజులు తీసేస్తే.. ఈ పధ్నాలుగు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి 341 రోజుల పాదయాత్ర చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు జరిగిన పాదయాత్ర నేటితో ముగుస్తోంది. ఈ సమయంలో పాదయాత్రలో జగన్ సాధించిందేమిటన్న చర్చ మాత్రం… రాజకీయ వర్గాల్లో సహజంగానే వస్తుంది. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవ్వొచ్చని.. జగన్ ఆశ పడుతున్నారు కానీ… అదంతా .. సెంటిమెంటేనని చెప్పుకోవచ్చు. వైఎస్ పాదయాత్ర చేశారు. కానీ ఆ పాదయాత్ర ద్వారానే సీఎం అయ్యారని ఎవరూ చెప్పలేరు. అప్పటికే తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉండటం… వైఎస్‌కు ఒక్క చాన్సిద్దామనే ఆలోచనతో ప్రజలు అప్పట్లో కాంగ్రెస్‌ను గెలిపించారనే విశ్లేషణ ఉంది. ఇక చంద్రబాబు మూడో సారి ముఖ్యమంత్రి అవడంలో పాదయాత్ర పాత్రను ఎవరూ పెద్దగా గుర్తుంచుకోరు. చంద్రబాబు గెలుపునకు… పాదయాత్ర కన్నా.. ప్రభావితం చేసిన కారణాలు వేరే ఉన్నాయి . అందుకే పాదయాత్ర గెలిపిస్తుందని కాదు కానీ.. జనంలో ఉన్నట్లు భావించడానికి మాత్రం ఉపయోగపడిందని భావించొచ్చు.
హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారా..?
ప్రభుత్వంపై ఏదైనా వ్యతిరేకత ఉండి… అది ప్రతిపక్షానికి కలసి రావాలంటే… ఖచ్చితంగా కొన్ని బ్రాండెడ్ హామీలు ఉండాలి. అప్పటో వైఎస్ ప్రకటించిన ఉచిత్ విద్యుత్.. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీల్లాంటివి. అలాంటిది ఒక్కటైనా.. వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిందా..? అంటే.. లేదనే చెప్పాలి. ఈ పాదయాత్ర కంటే ముందు జరిగిన ప్లీనరీలో తొమ్మిది ప్రధానమైన హామీలను జగన్ ప్రస్తావించారు. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు సంవత్సరానికి 12వేల 500 రూపాయలు పెట్టుబడి కింద ఇవ్వడం, ఫీజు రియంబర్స్ మెంట్, ఏటా 20వేల రూపాయలు ఒక్కో విద్యార్ధికి అందించడం, ఫీజు ఎంతైతే అంత చెల్లించడం, ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం కింద ప్రాజెక్ట్ లను పూర్తి చేయడం, మధ్యపాన నిషేధం, అమ్మ ఒడి పదకం, వైఎస్సార్ ఆసరా, పేదలందరికీ ఇళ్లు, పెన్షన్ల పెంపు వంటి 9హామీలను ప్రకటించారు. వీటిలో ఒక్కటంటే.. ఒక్కటి బ్రాండెడ్‌గా మార్చుకోలేకపోయారు. ఒక్క హామీపైనా ప్రజల్లో చర్చ జరగలేదు. నిజానికి.. జగన్ ప్రకటించిన రైతు భరోసా లాంటి పథకం.. రైతు బంధును కేసీఆర్ ప్రవేశ పెట్టి భారీ విజయం సాధించారు. అయినప్పటికీ.. దీన్ని కూడా ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా తీసుకెళ్లలేకపోయారనే అభిప్రాయం ఉంది.
మౌలిక ప్రజాస్వామ్య భావనలే లేని పాదయాత్ర వల్ల ప్రయోజనం ఏమిటి..?
పాదయాత్ర సమయంలో తన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ అనుకున్నారు. ఆ ప్రకారం నిర్ణయం ప్రకటించేశారు. ఇది తీవ్ర విమర్శలకు కారణం అయింది. గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పాదయాత్రలు చేసిన సమయంలో ఆయా పార్టీల ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి, తమ నేతల పాదయాత్రలో వచ్చిన సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి,వాటికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ మాత్రం తన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా ఆపేశారు. దీంతో జగన్ కు… ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలను కూడా పంపని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని ఎలా ఆశపడతారన్న సెటైర్లు సహజంగానే ప్రజల నుంచి వస్తున్నాయి. వీటికి సంతృప్తికరమైన సమాధానం ఇంకా.. జగన్ దగ్గర నుంచి రాలేదు. ఆయన వాదన మాత్రం ఆయన వినిపిస్తున్నారు.
పార్టీ క్యాడర్‌కు నైతిక స్థైర్యం ఇచ్చారా..?
జగన్ పాదయత్ర వల్ల వైసీపీ నేతల్లో కాస్త నైతిక స్థైర్యం పెరిగిందనే చెప్పుకోవాలి. పాదయాత్ర ప్రారంభానికి ముందు నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది వైసీపీ. అప్పట్నుంచి వైసీపీ ఎదురీదుతోందన్న ప్రచారం జరుగుతోంది. దాన్ని కొంత మేర నిలువరించుకోగలిగారన్న అభిప్రాయం ఉంది. పాదయాత్ర చేస్తూ.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను అంచనా వేసి.. ఎప్పటికప్పుడు.. నిర్ణయాలు తీసుకుని నియోజకవర్గాల ఇన్చార్జును మార్చి పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేశారు. జగన్ పాదయాత్ర ఆ పార్టీని ప్రజల్లో సజీవంగా ఉంచేందుకు, లీడర్లు, క్యాడర్లలో నైతిక స్థైర్యాన్ని నింపేందుకు ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు.
— సుభాష్