పోలవరం ఎత్తు తగ్గించం.. ఎత్తు తగ్గించడం అని కుండ బద్దలు కొడుతున్న ఏపీ ప్రభుత్వం.. అందులో మొత్తంగా నీటిని కూడా నిల్వ చేయబోవడం లేదని చావు కబురు చల్లగా చెబుతోంది. ప్రాజెక్టుల్లో కూడా విడతల వారీగా నీటి నిల్వ చేసే విధానాన్ని సీఎం జగన్ పాటించాలని నిర్ణయించారు. మొదటగా.. పోలవరం 41.5 మీటర్ల వరకే నీటి నిల్వ చేస్తారట. అంటే 120 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తారు. ఇలా చేయడం వల్ల… సహాయ పునరావాసానికి ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. కానీ.. ఈ 120 టీఎంసీల నీటి వల్ల గ్రావిటీ ద్వారా..రైతులకు నీళ్లివ్వడానికి అవకాశమే ఉండదు. మళ్లీ ఎత్తి పోసుకోవాలి. ఉత్తరాంధ్రకు నీటి పంపిణీ సాధ్యం కాదు. రాయలసీమ సంగతి చెప్పాల్సిన పని లేదు.
41.5 మీటర్ల వరకే నీటి నిల్వ చేయడానికి అవసరమైన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం నిధులు పూర్తి స్థాయిలో సమకూర్చుతామని జగన్ ప్రకటించారు. నీటి నిల్వ సంగతి చిన్నగా చెబుతున్న ప్రభుత్వం.. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మిస్తామని బిగ్గరగా చెబుతోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా చేసి.. 2022 ఖరీఫ్‌కు సాగునీరు ఇస్తామని చెబుతున్నారు. పోలవరం నిధుల విషయంలో కేంద్రం షాక్ ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఏపీ ప్రభుత్వం పడింది. కేంద్రాన్ని ఒప్పించడానికి తంటాలు పడుతోంది. ఇప్పుడు.. ఆ భారాన్ని.. నష్టాన్ని రాష్ట్రం మీదనే వేయాలని నిర్ణయించుకుంది. కేవలం 41.5మీటర్ల వరకే నీటి నిల్వ చేయడం అంటే.. అదో పెద్ద బ్యారేజీలాగే ఉంటుంది కానీ.. ప్రాజెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు.
అయితే.. పోలవరం డ్యామ్ పూర్తి స్థాయిలో కడితే.. నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నీటిని నిల్వ చేయబోం.. ప్రాజెక్టునే కడతామని చెప్పడం ద్వారా నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత భారీ వరదలు వచ్చి.. నీటిని నిల్వ చేయలేకపోయినా.. కిందకు వదిలే వరకూ ప్రాజెక్ట్ నిండితే… ముంపు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అందుకే.. పోలవరం విషయంలో ప్రభుత్వ వ్యూహం నిబంధనలకు విరుద్ధమన్న చర్చ జరుగుతోంది.