2019 ఎన్నికల్లో గెలిచి… రెండు రోజులు కాక ముందు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి .. 2024 గురించి పార్టీ నేతలకు.. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకుని 2024కు మరింత గొప్ప విజయాన్ని నమోదు చేయాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. జాగ్రత్తగా మసులుకోవాలని, తప్పుడు పనులు చేస్తే చంద్రబాబుకు వేసినట్లు ప్రజలు మొట్టికాయలు వేస్తారని చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడా విజయగర్వం ప్రదర్శించవద్దని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని జగన్ దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగిన సమావేశంలో జగన్ ఆచితూచి మాట్లాడారు. ఎమ్మెల్యేలంతా బాధ్యతగా మెలగాలని, సమస్య వస్తే ప్రజల దగ్గరకు మనమే వెళ్ళాలంటూ హితబోధ చేశారు. ఎనిమిదేళ్ల నుంచి ప్రజా సమస్యలపై అలుపెరగకుండా పోరాడామని, అందుకే ప్రజలు విశ్వసనీయతకు పట్టంకట్టారని, ఈ విజయంలో తనతోపాటు ఎమ్మెల్యేలందరూ కూడా భాగస్వాములేనని జగన్ అన్నారు. జగన్ గత ప్రసంగాల శైలితో పోలిస్తే.. ఎమ్మెల్యే, ఎంపీలతో విభిన్నంగా మాట్లాడారని.. వైసీపీ వర్గాలు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదాపై జగన్ గళం విప్పారు. ప్రధాన ఎజెండా ఇదేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటమే భవిష్యత్తులో కూడా చేయాల్సిందేనని, ఇదే ప్రధాన లక్ష్యంగా ఉండాలని, అవసరమైతే రాజీనామాల వరకు కూడా మరోసారి వెళ్లాల్సి వస్తుందని జగన్ పరోక్షంగా సూచించారు. ప్రత్యేకహోదాను సాధిస్తామన్న డిమాండ్‌తోనే.. జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా ఎంపీ సీట్లను కట్టబెట్టారన్న ప్రచారం మధ్య.. జగన్మోహన్ రెడ్డి ఆ దిశగానే తన ఆలోచనలు వివరించారు. అయితే.. ప్రస్తుతం పార్లమెంట్లో ఉన్న పరిస్థితులను చూస్తే.. కేంద్రానికి ఏ ఒక్క పార్టీ గోడు వినాల్సిన అవసరం కూడా లేదు. సన్నిహిత సంబంధాలతో…జగన్ హోదా సాధించుకుని రావాలి.
జగన్ తన రెండు ప్రసంగాల్లో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలకు బాధ్యతగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడంతోపాటు భవిష్యత్తుపై హితబోధ చేశారు. 2019 సంవత్సరం ముగిసిందని, 2024 ఎన్నికలు ముందున్న లక్ష్యమని, ఇప్పట్నుంచే ఆ దిశగా పనిచేయాలని స్పష్టం చేశారు. జగన్ ఎన్నికల ప్రసంగాల్లో 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాననే ఆకాంక్షను వ్యక్తం చేసేవారు. ఇప్పుడు.. దానికి తగ్గట్లుగా కార్యాచరణలా.. గెలిచిన వెంటనే 2024 ఎన్నికల గురించి మాట్లాడేస్తున్నారు.