ఆరు వారాల్లో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని మొత్తం ప్రజల ముందు ఉంచుతానని..జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార వేదిక మీద సవాల్ చేశారు. అన్నట్లుగానే.. ఆయన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షించడానికి… వరుస కమిటీలు నియమించారు. కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. అన్నింటికీ… అదేదో లక్కీ నెంబర్ అయినట్లుగా.. ఆరు వారాల గడువు ఇచ్చారు.
Read also : 6 నెలల పాలన : పాలనలో ముద్ర వేసేందుకు జగన్ మొదటి అడుగులు..!
అవినీతి కోసం ఎంత వెదికినా కనిపించలేదా..?
చంద్రబాబు అవినీని వెలికి తీసేందుకు నియమించిన కమిటీలు.. ఆరు వారాల పాటు.. అన్ని నిర్ణయాలను సమగ్రంగా.. క్షుణ్ణంగా పరిశీలించాయి. కానీ నివేదికలు ఏమయ్యాయో.. ఎవరికీ తెలియదు. ఆరు నెలలు గడిచినా ఒక్క విషయంలోనూ.. అవినీతిని బయట పెట్టలేకపోయారు. పోలవరం విషయంలో వేల కోట్ల అవినీతి జరిగిందని రేమండ్ పీటర్ నేతృత్వంలో కమిటీ వేశారు. నివేదిక తెప్పించారు. దాన్ని కేంద్రానికి సమర్పించారు. కానీ ఆధారాలు అడిగే సరికి సమర్పించలేక. ఆ నివేదికపై తమకే నమ్మకం లేదని లేఖ పంపాల్సి వచ్చింది. ఆ తర్వాత పోలవరంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇప్పుడీ విజిలెన్స్ విచారణ.. పోలవరం నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. ఇప్పుడు పోలవరంలో ఎలాంటి అవినీతి లేదని తామే మళ్లీ నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితిలో పడ్డారు.
రాజధానిపై చేసిన అవినీతి ఆరోపణలన్నీ ఉత్తవేనా..?
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆరు నెలలు గడిచినా.. ఒక్క ఇన్ సైడర్ ట్రేడింగ్ లావాదేవీ కూడా బయటపెట్టలేకపోయారు. భూముల లావాదేవీలపై.. సీఐడీ అధికారులతో నఖశిఖ పర్యంతం పరిశీలన జరిపారు. చివరికి.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు… అమ్మకాలు, కొనుగోళ్లు జరిపిన వారి వద్దకు వెళ్లిన సీఐడీ అధికారులు… ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. సుజనా చౌదరికి వందల ఎకరాలున్నాయని నిరూపిస్తానంటూ.. చాలెంజ్ చేసి.. కృష్ణా జిల్లాలో ఆయన స్వగ్రామంలో.. పూర్వికుల నుంచి వచ్చిన ఆస్తుల వివరాలను ప్రకటించి.. జబ్బలు చరుచుకున్నారు. ఆరు నెలల తర్వాత ఇప్పటికీ.. రాజధానిలో ఒక్క గజం అక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించలేకపోయింది.
Read Also : 6 నెలల పాలన : జగన్ ముంచేశారా..? మంచి చేశారా..?
రూ. ఆరు లక్షల కోట్ల అవినీతి పుస్తకం బోగస్సా..?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వైసీపీ నేతలు.. రూ. ఆరు లక్షల కోట్ల అవినీతికి టీడీపీ పాల్పడిందని పుస్తకాలు ప్రచురించారు. పదవి చేపట్టి ఆరు నెలలైనా .. ఒక్క అవినీతి వ్యవహారాన్ని బయట పెట్టలేకపోడంతో.. టీడీపీ నేతలు ఎద్దేవా చేయడం ప్రారంభించారు. అవినీతిని ఎందుకు బయటపెట్టలేదనే.. విమర్శలు ఎక్కువగా వస్తూండటంతో.. మంత్రులు తాజాగా..త్వరలో అవినీతిని బయట పెడతామంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై… గతంలో చేసిన అవినీతి ఆరోపణలన్నీ.. తేలిపోయినట్లుగా అయింది.