వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పెట్టే బహిరంగసభల్లో చేసే ప్రసంగాలు వింటూంటే.. కాస్తంత రోజువారీ వ్యవహారాలు.. తెలిసిన వారికి.. జగన్ మరీ ఇంత అమాయకుడా అన్న అనుమానం రాకుండా ఉండదు. ఎందుకంటే.. అది కాదు.. అని స్పష్టంగా తెలిసిన విషయాన్నే ఆయన తనకు ఏమీ తెలిదన్నట్లు .. ప్రజల ముందు బిగ్గరగా చెబుతూంటారు. ముఖ్యంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబధించిన అంశాల్లో అయితే ఆయన ఈ అమాయకత్వం మరింత ఎక్కువగా ఒలకబోస్తూంటారు. అనకాపల్లిలో పాదయాత్ర బహిరంగసభలో మాట్లాడిన జగన్.. అక్కడి బెల్లం వ్యాపారుల కష్టాలన్నీ చంద్రబాబు వల్లేనని చెప్పాలనుకున్నారు. అలా చెప్పాలంటే… చంద్రబాబుకు ఉన్న హెరిటెజ్తో లింక్ పెట్టేస్తే సరిపోతుందనుకున్నారు. వెంటనే తడబాటు లేకుండా.. హెరిటేజ్‌కు.. బెల్లానికి లింక్ పెట్టేశారు.
అనకాపల్లి బెల్లం రేతులు అప్పుల పాలై భూములు అమ్ముకుంటున్నారని.. జగన్ ఆవేదన వ్యక్తం చేయడమే కాదు.. అనకాపల్లికి వచ్చే బెల్లం ప్రతి ఏడాది తగ్గిపోతుందని తేల్చారు. దానికి కారణం గిట్టుబాటు ధరలు లేకపోవడమట. అదే సీఎం చంద్రబాబు హెరిటేజ్ షాప్‌లో బెల్లం ధర 84 రూపాయలు. కానీ రైతులు తయారు చేసిన క్వింటాల్ బెల్లానికి రూ.2500 నుంచి 3వేలు పలకడం లేదట. మార్కెట్ బెల్లానికి, హెరిటేజ్ బెల్లం ధరకు చాలా తేడా ఉంది. సీఎం చంద్రబాబే దళారిగా మారితే రైతులను ఆదుకునేది ఎవరు? అంటూ ఆవేశ పడిపోయారు. బెల్లం వ్యాపారులకు నిజం తెలిసినా… సామాన్యులకు మాత్రం ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది.
నిజానికి హెరిటెజ్ అనే పాలు, పాలపదార్థాల కంపెనీ మాత్రమే.. ఇప్పుడు చంద్రబాబు కుటుంబం చేతుల్లో ఉంది. నిత్యాసవసరాలు అమ్మే హెరిటెజ్ ఫ్రెష్ వ్యాపారాన్ని ఎప్పుడో.. వంద శాతం.. కిషోర్ బియానీకి చెందిన… ఫ్యూచర్ రీటైల్కి అమ్మేశారు. ఇప్పుడు హెరిటేజ్ ఫ్రెష్‌కి.. చంద్రబాబు కుటుంబానికి ఏ సంబంధం లేదు. కార్పొరేట్ వ్యవహారాల్లో పండిపోయిన జగన్‌కు ఇది తెలియనిది కాదు. పోనీ మర్చిపోయాడని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే.. గతంలో ఇలా రీటైల్ వ్యాపారాన్ని హెరిటేజ్ అమ్మేసినప్పుడు.. ఆయన చేసిన విమర్శలు చాలా పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. అలాంటివి మర్చిపోరు కదా..! అయినా సరే .. ప్రజల్లో అనుమానం కల్పించడానికి… తనకు తెలిసిన అబద్దాన్ని నిజంగా ప్రజల్లోకి చొప్పించడానికి ఆయన ఏ మాత్రం సందేహించరు. జగన్ మార్క్ రాజకీయం అంటే అదేనేమో..?