విశాఖ జిల్లాలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం సాగుతోంది. ఈ సందర్భంగా జగన్ మరోసారి ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రొటీన్ విమర్శలు చేశారు. ‘నీది నోరా… అబద్ధాల ఫ్యాక్టరీనా అని చంద్రాబు నాయుడుని అడుగుతా ఉన్నా’ అంటూ ఒక ట్యాగ్ లైన్ తీసుకుని… రెగ్యులర్ గా చేసిన ఆరోపణల్నే చేశారు. గ్రామాల్లో పేదలకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టించలేదనీ, ఎన్నికలు వచ్చేస్తుండటంతో ఇప్పుడు ఆర్నెల్లలో లక్షల ఇళ్లు కట్టేస్తానని చంద్రబాబు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు బెల్టు షాపులు ఎత్తేస్తానని చెప్పారనీ, ఇప్పుడు వీధికో షాపు ఉందని అన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతీదీ చేయాల్సిన ధర్మం ప్రతీ రాజకీయ నాయకుడిపై ఉంటుందని జగన్ చెప్పారు. కానీ, చంద్రబాబు నాయుడు మాత్రం ఏ ఒక్క హామీ అమలు చెయ్యకుండా… 99 శాతం అమలు జరిగిపోయిందని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలందరి తరఫునా తాను అడుగుతున్నాననీ, చంద్రబాబుది నోరా అబద్ధాల ఫ్యాక్టరీనా అని అడుగుతా ఉన్నా అన్నారు. ప్రత్యేక హోదాపై మాట మార్చారనీ, ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదనీ, ఇసుక ఉచితం అంటారుగానీ ఇవ్వరనీ, తన మీదున్న కేసుల కోసం లంచాల కోసం హోదా తాకట్టు పెట్టారనీ,… ఇలా జగన్ అన్నీ ఆరోపణలూ విమర్శలే చేశారు.
ప్రభుత్వ పథకాలు, లేదా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అందరికీ అందడం లేదంటే కొంత అర్థం ఉంటుంది. ఏ ఒక్కరికీ ఏదీ అందడం లేదని జగన్ విమర్శిస్తుండటం నమ్మశక్యంగా వినిపించడం లేదు. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే చాలా జరిగాయి, పెన్షన్లు అందుతున్నాయి, రుణమాఫీ కూడా జరిగింది, ఇతర ప్రభుత్వ పథకాలూ అమల్లో ఉన్నాయి. అర్హులైన అందరికీ ఇవి అందడం లేదని విమర్శిస్తే… కొంతైనా అర్థవంతమైనవిగా ఉంటాయి. అంతేగానీ… ఏమీ జరగలేదనీ, రాష్ట్రంలో ప్రభుత్వం అబద్ధమనీ, చంద్రబాబు నాయుడు అబద్ధమనీ, తాను చేస్తున్న విమర్శలూ ఆరోపణలు మాత్రమే నిజాలన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నారు.
జగన్ పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచీ… కోట్లకు కోట్లు అవినీతి జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారు. ఇసుక నుంచి మట్టి దాకా అంటూ ఓ దండకం చదువుతూ ఉంటారు. అన్ని ఆరోపణలు చేస్తుంటారుగానీ… ఒక్కదానికైనా ఆధారాలు చూపిస్తే అప్పుడు జగన్ చెప్పింది నిజమే అని ప్రజలు నమ్మేందుకు అవకాశం ఉంటుంది. ఆయన చేసే ఆరోపణలకు ఆధారాలుండవూ, ప్రభుత్వం చేస్తున్నదంతా అబద్ధమంటే ఎలా..? జగన్ లెక్కల ప్రకారం టీడీపీ పాలన అంతా అబద్ధాలే అనుకుంటే, జగన్ ఆరోపణల్లో నిజాలున్నాయన్న నమ్మకం ప్రజలకు కల్పించాలి కదా.