ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రసంగాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచీ ప్రతీచోటా దాదాపు ఒకే రకమైన అంశాలు మాట్లాడుతూ, ఒకేలా ప్రసంగిస్తూ ఉన్నారు. తొలి వారం రోజులకే అవి రొటీన్ అయిపోయాయి అనే ఫీలింగ్ అందరికీ కలిగింది. అయితే, రొటీన్ కి భిన్నంగా, కాస్త కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నారో ఏమో.. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో సాగుతున్న పాదయాత్రకు ఓ కథ రాసుకుని వచ్చారు. ఆ కథలో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. జగన్ ప్రసంగాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శల తప్ప కొత్త విషయం ఏముంటుంది..? ప్రస్తుతం ఆయన రాసుకొచ్చిన, లేదా రాయించి చదివిన కథలో కూడా అదే సారాంశం.
ఇంతకీ జగన్ చెప్పిన ఆ కథేంటంటే… అనగనగా ఒక దొంగ ఉండేవాడనీ, వాడు చిన్నచిన్న దొంగతనాలు చేసుకుని బతికేవాడట. వాడు చనిపోయాక, యమధర్మరాజు వచ్చాడట. నువ్వు దొంగతనం చేస్తుండగా దొరికావు కదా అంటే.. నీ దగ్గర ఆధారాలవైనా అని యమధర్మరాజును అడిగాడట. సీసీ కెమెరాల్లో రికార్డైంది చూడు అని యమధర్మరాజు చూపిస్తే.. ఇది చూడలేదా స్వామీ అంటూ సదరు దొంగ కూడా యమధర్మరాజుకి ఒక ఆధారం చూపించాట అంటూ జగన్ ఒక ఫొటో చూపించారు. అదేంటంటే, ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి వీడియో ఫుటేజ్ లోని ఫొటో. తమ ముఖ్యమంత్రి అవినీతి సొమ్ముతో ఇలా విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని సదరు దొంగ చెప్పాడట. ఆ తరువాత, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోని కూడా సదరు దొంగ యమధర్మరాజుకి చూపించాడనీ, మా ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన మాట తప్పారంటూ ఆ దొంగ చెప్పాడని కథగా చెప్పారు. ఇదండీ జగన్ చెప్పిన కథ.
భాజపాతో టీడీపీ బంధం తెంచుకున్న దగ్గర్నుంచీ జగన్ తీరుని గమనిస్తే… ముఖ్యమంత్రిపై విమర్శల తీవ్రత పెంచారు. అంతేకాదు, అడుగడుగునా అవినీతి అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ఆధారాలు చూపించితే తప్ప ప్రజలు నమ్మరు అనే విషయాన్ని పూర్తిగా పక్కన పడేశారు. కానీ, ఈ మధ్య రోజుకి ఒకసారైనా ‘ముఖ్యమంత్రి అవినీతిపరుడు’ అని ఆరోపించాలనేదే పనిగా పెట్టుకున్నారు కదా. అవి కూడా రొటీన్ అయిపోయాయని ఆయనకే బొరు కొట్టిందేమో.. కొత్తగా కథ రాసుకుని వచ్చారు.