పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి అధికారం కోల్పోయాక ప్రధాని మోడీని కలవాలనుకున్నా సాధ్యపడటం లేదు. మోడీని కలిసేందుకు అన్ని దారులూ మూసుకుపోయాయి. ఇప్పుడు ఆ అవకాశం ఇస్తామని టీడీపీ ఆఫర్ చేస్తోంది. ప్రధాని మోడీ పాల్గొనే సభలో భాగస్వామ్యం అయ్యేందుకు జగన్ కు అవకాశం ఇస్తామని అంటోంది. కానీ, ఆయన సానుకూలంగా స్పందిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనుల్ని త్వరలో ప్రారంభించబోతోంది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ముఖ్య అతిధిగా ఆహ్వానించింది. మే2న వచ్చేందుకు మోడీ అంగీకరించారు. లక్ష కోట్లతో రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. దీంతో ప్రధాని టూర్ విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీని నియమించారు సీఎం చంద్రబాబు. ప్రధాని హాజరయ్యే సభపై సోమవారం సమావేశం అయిన మంత్రుల కమిటీ.. వైసీపీని కూడా ఈ సభకు ఆహ్వానిస్తామని స్పష్టం చేసింది.
అలాగే గతంలో మాదిరిగా ప్రతిపక్షాలను, ఇప్పుడు కూడా రాజధాని నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభకు ఆహ్వానిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గతంలో ప్రధాని మోడీ అమరావతి రాజధాని శంఖుస్థాపనకు వచ్చినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆహ్వానించినా జగన్ హాజరుకాలేదు. ఇప్పుడు మళ్లీ ఆహ్వానిస్తామని చెబుతున్నారు.
మరి, ప్రధాని మోడీని కలిసేందుకు జగన్ వస్తారో.. లేదంటే అమరావతి రాజధానిపై విషం కక్కిన చరిత్ర ఉండటంతో ఆ సభకు వెళ్తే పలుచన అవుతామని దూరంగా ఉంటారో చూడాలి. జగన్ కు ప్రధానిని కలిసే అవకాశం ఉన్నా..అమరావతిపై కనబరిచిన వ్యతిరేకత దృష్ట్యా వైసీపీ మరోసారి ఈ సభకు దూరంగా ఉండే అవకాశమే అధికం.