తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన దాదాపు ఖరారయింది. ఆయన శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరుతారు. ఢిల్లీలో కేంద్రహోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రుతో భేటీ అవుతారు. నిజానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నది అధికారసమావేశంలో పాల్గొనడానికి. ఈనెల 26న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంశాఖ అమిత్‌షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. అందుకే ఏపీ సీఎంకు కూడా ఆహ్వానం వెళ్లింది. కేసీఆర్ పర్యటన దాదాపుగా ఖరారైంది. మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. వాస్తవానికి శుక్రవారమే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశం మొదటి రోజు వాయిదాపడ్డ తర్వాత రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరుతారు.
సీఎం జగన్ పర్యనట షెడ్యూల్‌పై ఇంకా ఎలాంటి అదికారిక ప్రకటన రాలేదు. అయితే కేంద్ర హోంమంత్రితో జరిగే సమావేశం కాబట్టి జగన్ డుమ్మా కొట్టే అవకాశం లేదని చెబుతున్నారు. 26న సమావేశం కాబట్టి వెళ్తారని భావిస్తున్నారు. కేసీఆర్ ఇటీవలి ఢిల్లీ పర్యటన తర్వాత జగన్ కూడా ఢిల్లీకి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ అవకాశం లభించింది.