తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాస్త గ్యాప్ తీసుకుని మరోసారి భేటీ అవబోతున్నారు. ఈ నెల పదమూడో తేదీన హైదరాబాద్లో జగన్ – కేసీఆర్ సమావేశం అవుతారని.. ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ భేటీ గతంలో జరిగినట్లుగా ప్రగతి భవన్లో జరుగుతుంది. అజెండా ఏమిటన్నదానిపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. గతంలో.. ఓ సారి ఇలానే.. సమావేశమయ్యారు. అప్పుడు అధికారులు సహా ఎవరూ లేరు. జగన్ – కేసీఆర్తో పాటు వారి పార్టీలకు చెందిన ఇద్దరు, ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించుకున్నట్లు ప్రకటించారు కానీ.. అధికారులు కానీ.. సమస్యల పరిష్కార ఎజెండా కానీ..లేకుండా సమావేశం అవడంపై.. చాలా విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా వారు.. పూర్తిగా రాజకీయ వ్యవహారాలపై చర్చించారని.. తర్వాత మీడియాలో వచ్చింది.
ఆ భేటీకి సంబంధించి కొన్ని వివరాలు లీకయ్యాయి. ఆ వివరాలను… జగన్మోహన్ రెడ్డి తరపున వైసీపీ ఖండించింది. కానీ.. తెలంగాణ సీఎం మాత్రం… వాటిని పట్టించుకోలేదు. ఆ తర్వాత.. వైసీపీ అధినేత జగన్ , కేసీఆర్ మధ్య దూరం పెరిగినట్లుగా ప్రచారం జరిగింది. ఉమ్మడి ప్రాజెక్ట్ గురించి జగన్ పట్టించుకోవడం మానేశారు. తానే స్వయంగా… పోలవరం నుంచి ఓ ప్రాజెక్ట్ కు… డిజైన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బానకచర్ల హెడ్ రెగ్యూలేటర్ నిర్మించి..సీమకు నీళ్లు తరలిస్తామని చెబుతున్నారు. దీనిపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. అదే సమయంలో..జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డి సామర్థ్యాన్ని పెంచుతామని అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీనిపై.. తెలంగాణలో విపక్షాలు.. కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నాయి. నాగం జనార్ధన్ రెడ్డి లాంటి నేత రాజకీయంగా జగన్ ప్రకటనను మరింతగా ఉపయోగించుకుని రంగంలోకి దిగుతున్నారు.
ఓ వైపు ఏపీలో రాజధాని ఆందోళనలు.. రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఇలాంటి సమయంలో.. కేసీఆర్ తో భేటీ అంటే… సహజంగానే… ప్రజల్లో ఆసక్తి ఏర్పడుతుంది. రాజధాని గురించి గతంలో.. కేసీఆర్.. డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనే వ్యాఖ్యలు చేశారు. అవి జగన్ పై ప్రభావం చూపాయేమో కానీ.. రాజధానిని పూర్తి స్థాయిలో నిలిపివేసి.. అమరావతి తరలిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. రాజధానిపై కేసీఆర్ సలహాలను జగన్ తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది.